హైదరాబాద్ శివారులో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో భారీ ఎత్తున తరలిస్తున్న గంజాయిని పోలీసులు ఛేదించారు. ఈ ఆపరేషన్ లో రూ. 2 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
శేర్లింగంపల్లి జోన్ డీసీపి చింతమనేని శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం. . కూకట్‌పల్లి ఎస్‌వోటీ , పటాన్‌చెరు పోలీసులు కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఒక అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టయింది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుండి మహారాష్ట్రలోని సోలాపూర్‌కు గంజాయిని తరలిస్తుండగా.. పటాన్‌చెరు ఓఆర్ఆర్ (ORR) వద్ద పోలీసులు ఈ ముఠాను అడ్డుకున్నారు. నిందితులు అత్యంత పకడ్బందీగా.. డీసీఎం వ్యాన్‌కు ముందుగా ఒక ఇండికా కారును పైలట్‌గా, ఎర్టిగా కారును ఎస్కార్ట్‌గా వాడుతూ పోలీసుల కళ్లు గప్పే ప్రయత్నం చేశారు.
మహారాష్ట్రకు చెందిన మనీషా పద్వాల్ అనే వ్యక్తికి ఈ గంజాయిని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో సుమారు రూ. 2 కోట్ల విలువైన 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు ఒక డీసీఎం, రెండు కార్లు, 6 మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.
ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలు ఏ1 మనీషా పద్వాల్‌తో పాటు ఏ2 ట్రిబ్యున్ పరారీలో ఉన్నట్లు డీసీపి తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
