- మూడు కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణం
- రూ. 20 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం
- వీకెండ్ స్పాట్‌గా సిరిసిల్ల బతుకమ్మ ఘాట్
రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల మానేరు తీరంలో బ్యూటిఫికేషన్ పనులు స్పీడ్‌గా సాగుతున్నాయి. మానేరు తీరాన్ని ఆనుకుని ఉన్న తంగళ్లపల్లి బ్రిడ్జి నుంచి మొదలుకొని సాయినగర్ వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించనున్నారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.20కోట్లు మంజూరు చేయగా.. వారం రోజులుగా పనులు జోరందుకున్నాయి.
జోరుగా పనులు
సిరిసిల్ల బతుకమ్మ ఘాటు వద్ద పట్టణ వాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు గత ప్రభుత్వం మానేరు ఒడ్డును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు పనులు స్టార్ట్ చేసింది. కాగా గత ప్రభుత్వంలో కొన్ని పనులు పూర్తయ్యాయి. బతుకమ్మ ఘాటు నుంచి అయ్యప్ప ఆలయం వరకు మూడు కిలోమీటర్ల మేర మట్టి పోశారు. దీని కోసం రూ.5కోట్లు ఖర్చు చేయగా.. కొన్ని పనులు పూర్తి చేశారు. ఏర్పాట్లు జరుగుతున్నాయి.గత ప్రభుత్వం బతుకమ్మ ఘాటు వద్ద కొన్ని వసతులు కల్పించింది.
వీకెండ్ స్పాట్‌గా బతుకమ్మ ఘాటు
మానేరు తీరంలో చేపట్టిన బ్యూటిఫికేషన్ పనులు పూర్తయితే సిరిసిల్ల ప్రజలకు బతుకమ్మ ఘాటు వీకెండ్ స్పాట్ గా మారనుంది. ప్రస్తుతం మానేరు తీరానికి కుడివైపున కరకట్ట దాదాపు 80 అడుగుల వెడల్పు, 18 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నారు. గత ప్రభుత్వం తంగళ్లపల్లి బ్రిడ్జికి అవతల ఎడమ వైపు మిడ్ మానేరు బ్యాక్ వాటర్ ఉన్న ప్రాంతంలో తక్కువ ఎత్తుతో ఒకే వెహికల్ పోయేలా కట్ట నిర్మించారు.
దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. బ్రిడ్జి కుడివైపున కరకట్టను ఆకర్షణీయంగా నిర్మిస్తున్నారు. వరంగల్ భద్రకాళీ చెరువులో తరహాలో కరకట్టపై సైకిల్ ట్రాక్, పిల్లల కోసం పార్క్, మ్యూజికల్ ఫౌంటెన్లు, యోగా సెంటర్లు, వాకింగ్ ట్రాక్ లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో సిరిసిల్ల పట్టణంతో పాటు వేములవాడ రాజన్న టెంపుల్ దర్శనానికి వచ్చే భక్తులను ఆకర్షించే అవకాశం ఉంది.
ఎన్నికల కోడ్ వల్ల పనులు ఆలస్యం
గత ప్రభుత్వ హయాంలో మానేరు ఒడ్డును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు పనులు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్ట్ కోసం ఫండ్స్ మంజూరు చేశారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల కోడ్ వల్ల టెండర్లు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ పూర్తవడంతో పనులు స్పీడ్‌గా సాగుతున్నాయి. ముందుగా కరకట్ట నిర్మించి, ఆ తర్వాత మిగతా సుందరీకరణ పనులు ప్రారంభించనున్నారు.
కాగా బతుకమ్మ ఘాటు నుంచి అయ్యప్ప ఆలయం వరకు మూడు కిలోమీటర్లు మేర గత ప్రభుత్వం హయాంలోనే మట్టి పోశారు. దీని కోసం రూ. 5 కోట్లు ఖర్చు పెట్టారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, నాసిరకం పనులతో వానలకు మట్టి కొట్టుకుపోయింది. దీంతో ఆ ఖర్చంతా వరదలో కొట్టుకుపోయినట్లయింది.
