
- 2026 -మహా జాతర నాటికి పనులు పూర్తి చేసే యోచన
- జంపన్నవాగు అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు
- ములుగు నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి రూ.1.42 కోట్లు మంజూరు
జయశంకర్ భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు: మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2026 మహాజాతరకు వచ్చే భక్తుల సౌలతులు కల్పించేందుకు రూ.30 కోట్లు మంజూరు చేసింది. జంపన్నవాగు అభివృద్ధి కోసం ఇటీవల రూ.5 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా ములుగు నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి రూ.1.42 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రూ.30 కోట్లతో శాశ్వత పనులు..
వనదేవతలు కొలువుదీరిన మేడారం ఇప్పటికే నిత్య జాతరలా మారింది. శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో 10 వేలు, సాధారణ రోజుల్లో 3 వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు శాశ్వత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులోభాగంగానే రూ.30 కోట్లు మంజూరు చేసి పనులు చేపట్టింది. గతంలో మహా జాతరకు రెండు, మూడు నెలల ముందు అభివృద్ధి పనులు చేపట్టడంతో పనుల్లో నాణ్యత లోపించేది. మంత్రి సీతక్క జోక్యంతో ఇప్పుడు జాతరతో సంబంధం లేకుండా మేడారంలో శాశ్వత పనులు జరుగుతున్నాయి.
మేడారం స్థూపం నుంచి కన్నెపల్లి, ఊరట్టం నుంచి స్థూపం వరకు రూ.4 కోట్లతో, మేడారం ఆర్అండ్ బీ రోడ్డు నుంచి శివరాం సాగర్ చెరువు మీదుగా వీవీఐపీ పార్కింగ్ వరకు రూ.2.75 కోట్లతో సీసీ రోడ్డు పనులు చేపట్టారు. కన్నెపల్లి, ఊరట్టం రోడ్లు కంప్లీట్ కాగా, వీవీఐపీ రోడ్డు పనులు అటవీ శాఖ అనుమతి రాకపోవడంతో పనులు మొదలుపెట్టలేదు.
వనదేవతలను దర్శించుకునేందుకు ఆలయం చుట్టూ 3 క్యూ లైన్లు ఉండగా, వీటిలో రెండు క్యూలైన్లపై రూ.3.08 కోట్లతో జీఐ షీట్స్తో పైకప్పు వేస్తున్నారు.
రూ.8 కోట్లతో కాల్వపల్లి గ్రామం నుంచి ఊరట్టం వరకు 6 కిలోమీటర్ల బీటి రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరవగా, టెండర్ దశలో ఉన్నాయి. రూ.1.30 కోట్లతో ఇంగ్లిష్ మీడియం స్కూల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వెనక రోడ్డుకు వెళ్లే వనం రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి.
అమ్మవార్ల ఆలయం వెనుక వైపు రూ.1.98 కోట్లతో నిర్మించిన పూజారుల వసతి గృహాన్ని ఇటీవల మంత్రి సీతక్క ప్రారంభించారు. రూ.1.88 కోట్లతో మేడారం సమ్మక్క దేవత, కన్నెపల్లి సారలమ్మ దేవత ఆలయాలను పునః నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రూ.2 కోట్లతో సత్రాల
నిర్మాణానికి నిధులు మంజూరవగా, స్థలం సమస్యతో పనులు ఆగిపోయాయి. గిరిజన మ్యూజియం, బంధం దారి విస్తరణకు రూ.1.30 కోట్లు మంజూరయ్యాయి.
జంపన్నవాగు అభివృద్ధికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. 2026లో మహాజాతర నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వం టూరిజం శాఖ తరపున పనులు చేపట్టాలని నిర్ణయించింది.
ములుగు ఎమ్మెల్యే అయిన మంత్రి సీతక్క అభ్యర్థనతో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీజీఎఫ్ నిధుల నుంచి రూ.1.42 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ జానకి రామాలయానికి రూ.12 లక్షలు, కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయానికి రూ. 50 లక్షలు, ములుగు మండలం జగ్గన్నపేట పుట్టా మల్లికార్జున స్వామి ఆలయానికి రూ.30 లక్షలు, మల్లంపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.20 లక్షలు, ములుగు పట్టణంలోని నాగేశ్వరస్వామి ఆలయానికి రూ.20 లక్షలు, రామాలయానికి రూ.10 లక్షలు మంజురు చేశారు.