
- ఒక్కసారి కొనే కిట్ కోసం రూ.33 వేలు
- బంగ్లాదేశ్‌లో వసూలు చేస్తున్న రేట్లకే ఇండియాలో సర్వీస్‌లు
- ఇంకో 12 నెలల్లో స్టార్‌లింక్ శాటిలైట్ సేవలు
న్యూఢిల్లీ: ఎలన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ మరికొన్ని నెలల్లో ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. అన్‌లిమిటెడ్ డేటాను నెలకు రూ.3 వేలకు అందించనుందని ఎన్‌డీటీవీ రిపోర్ట్ చేసింది. రిసీవర్ కిట్ కోసం ఒక్కసారి రూ.33 వేలు ఖర్చు అవుతుందని పేర్కొంది. స్టార్‌లింక్ సర్వీసులు మరో 12 నెలల్లో ప్రారంభం అవుతాయని అంచనా.
ఎయిర్‌టెల్, జియోతో పోటీ
స్టార్‌లింక్ ఈ నెల 6న మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి కీలక లైసెన్స్ పొందింది. దీంతో భారత బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది. స్టార్‌లింక్, భారతి ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్, రిలయన్స్ జియోకు చెందిన శాటిలైట్ బిజినెస్ కలిసి, భారతదేశంలో శాటిలైట్-ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్‌లను అందించనున్నాయి. మస్క్ కంపెనీ తన లో-ఎర్త్ ఆర్బిట్ (ఎల్‌ఈఓ) శాటిలైట్ల ద్వారా 25–220 ఎంబీపీఎస్ స్పీడ్ అందించనుంది.
గ్రామీణ, రిమోట్ ఏరియాలను మొదట టార్గెట్ చేస్తుందని తెలుస్తోంది. ఇటువంటి ప్రాంతాల్లో ఫైబర్, మొబైల్ నెట్‌వర్క్ సేవలు పరిమితంగా ఉంటాయి. కొన్ని చోట్ల పూర్తిగా నెట్‌వర్కే ఉండడం లేదు. భారత్‌లో డేటా రేట్లు చాలా చౌకగా ఉన్నప్పటికీ, స్టార్‌లింక్ మారుమూల ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఎక్కువ వసూలు చేయనుందని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
ప్లాన్ ధరలు ఇలా..
అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్ ధర నెలకు రూ.3 వేలు ఉండొచ్చని అంచనా. స్టార్టింగ్‌లో ఆఫర్ కింద రూ.800–1,000 ఉంటుందని రిపోర్ట్స్ వెలువడ్డాయి. హార్డ్‌వేర్ కిట్ ధర రూ.33 వేలు ఉంటుంది. హార్డ్‌వేర్ కిట్‌ను ఒక్కసారి కొంటే సరిపోతుంది. ఇండియాలో సర్వీస్‌ల కాస్ట్ (ప్లాన్ ఖర్చు+ కిట్ ఖర్చు) లాంచ్ అయిన మొదటి ఏడాది రూ.1.58 లక్షలు, తర్వాతి ఏళ్లలో రూ.1.15 లక్షలకు తగ్గుతుందని గతంలో స్టార్‌లింక్ ఇండియా మాజీ హెడ్ సంజయ్ భార్గవ అన్నారు.
కానీ, బంగ్లాదేశ్‌లో ఆఫర్ చేస్తున్న రేట్లకు ఇండియాలో సర్వీస్‌లను అందించే అవకాశం ఉంది. దీంతో మొదటి ఏడాది కస్టమర్‌కు అయ్యే మొత్తం ఖర్చు రూ.66 వేలు ఉంటుందని అంచనా. రెసిడెన్షియల్ లైట్ ప్లాన్స్ ధరలు నెలకు రూ.2,600–రూ.3,000 వేల రేంజ్‌లో, స్టాండర్డ్ ప్లాన్స్ ధర నెలకు రూ.4,000–రూ. 6,000 ఉంటాయని ఎన్‌డీటీవీ రిపోర్ట్ చేసింది. మార్కెట్‌పై ఆధారపడి ధరలు ఉంటాయని తెలిపింది. కాగా, స్టార్‌లింక్ లైసెన్స్ పొందినప్పటికీ, స్పెక్ట్రం కేటాయింపుల కోసం ట్రాయ్ చేసిన సిఫార్సులు ఇంకా ప్రభుత్వ ఆమోదం పొందలేదు. ఇన్‌స్పేస్ నుంచి కూడా ఫైనల్ అప్రూవల్ రావాల్సి ఉంది.