Movie Ticket: సామాన్యుడి జేబుకు ఊరట.. బాక్సాఫీస్ క్లాష్‌లో మేకర్స్ బంపరాఫర్.. రూ.50కే ‘గవర్నర్’ టికెట్

Movie Ticket: సామాన్యుడి జేబుకు ఊరట.. బాక్సాఫీస్ క్లాష్‌లో మేకర్స్ బంపరాఫర్.. రూ.50కే ‘గవర్నర్’ టికెట్

ప్రస్తుతం సినిమా టికెట్ ధరలు సామాన్య ప్రేక్షకుడికి భారంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పోటీ ప్రపంచంలో అలసిపోయి ఓ సినిమా చూద్దాం అనుకున్నా, జేబులో 500 రూపాయలు ఉండాల్సిందే. ఇక ఫ్యామిలీని తీసుకెళ్లి సినిమా చూపెట్టాలంటే లేదన్నా ఒక 2 వేలు ఉండాల్సిందే. ఇలాంటి సమయంలో బాలీవుడ్‌లో విడుదలకు సిద్ధమైన ‘గవర్నర్’ మూవీ మేకర్స్ ప్రేక్షకులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు. తొలి 25 వేల టికెట్లను కేవలం రూ.50కే అందిస్తూ ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు. భారీ బాక్సాఫీస్ పోటీ మధ్య తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

బాలీవుడ్‌లో రేపు శుక్రవారం జూన్ 12న నాలుగు సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయి. అందులో అన్నీ పెద్ద సినిమాలే. ఈ నేపథ్యంలో స్టార్ హీరో మనోజ్ బాజ్‌పాయ్ నటించిన ‘గవర్నర్’ మూవీ మేకర్స్.. 1990ల కాలానికి తీసుకెళ్లే ఆసక్తికరమైన ఆఫర్‌ను ప్రకటించారు. కథ నేపథ్యం కూడా 1990ల నాటి భారత ఆర్థిక సంక్షోభం కావడంతో, ఆ కాలం టికెట్ ధరలను గుర్తు చేస్తూ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చారు.

ఆఫర్ ఎలా పొందాలి?

1991 ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తెరకెక్కిన ‘గవర్నర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు అదే కాలాన్ని ప్రతిబింబించేలా మేకర్స్ ప్రత్యేక టికెట్ ఆఫర్‌ను ప్రకటించారు. ఈ ఆఫర్ కింద 25,000 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ప్రేక్షకులు BookMyShowలో టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ‘GOVERNOR90’ కూపన్ కోడ్‌ను ఉపయోగిస్తే రూ.50 ధరకు టికెట్ పొందవచ్చు. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియాలో ప్రకటిస్తూ, ఆఫర్ ముగిసేలోపు టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.

‘గవర్నర్’ కథ ఏమిటి?

1991 ఆర్థిక సంక్షోభ సమయంలో దేశాన్ని గాడిలో పెట్టిన మాజీ ఆర్‌బీఐ గవర్నర్ ఎస్. వెంకటరమణన్ జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా ఈ ఎకనామిక్ థ్రిల్లర్ తెరకెక్కింది. చిన్మయ్ మాండ్లేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పాయ్, అదా శర్మ కీలక పాత్రల్లో నటించారు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, దివాలా అంచులకు చేరిన సమయంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఈ చిత్రం చూపించనుంది.

ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పాయ్ ఆర్‌బీఐ గవర్నర్ పాత్రలో కనిపించనున్నారు. దేశాన్ని సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ఆయన తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయాలు, ఎదురైన సవాళ్లు, వాటి ప్రభావం కథలో ప్రధానాంశాలుగా ఉంటాయి. భారీ పోటీ మధ్య ఈ ప్రత్యేక టికెట్ ఆఫర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు సువేందు భట్టాచార్య, సౌరభ్ భరత్, రవి అస్రానీ, విపుల్ అమృత్‌లాల్ షా కలిసి కథా రచన చేశారు. ప్రముఖ గేయ రచయిత జావేద్ అఖ్తర్ పాటలు రాయగా, అమిత్ త్రివేది సంగీతం అందించారు.

ఇకపోతే రేపు శుక్రవారం  ఇంతియాజ్ అలీ డైరెక్షన్లో వస్తున్న ‘మై వాపస్ ఆవుంగా’, కంగనా రనౌత్ ‘భారత్ భాగ్య విధాత’, విక్రమ్ భట్ హారర్ మూవీ ‘హాంటెడ్ 3డీ: ఎకోస్ ఆఫ్ ది పాస్ట్’ మూవీస్ రిలీజ్ కానున్నాయి.