- రాష్ట్రంలో రెచ్చిపోతున్నసైబర్ నేరగాళ్లు
- గతేడాది 3,037 డిజిటల్ అరెస్టు కేసులు, రూ.177 కోట్లు దోపిడీ
- ఢిల్లీ, ముంబై, కోల్‌కతా కేంద్రంగా నేరాలు
- దేశంలో నమోదైన కేసులన్నీ సీబీఐ చేతికి!
హైదరాబాద్, వెలుగు: ‘డిజిటల్ అరెస్ట్’.. ప్రస్తుతం ఈ మాట వింటేనే సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా వణుకిపోతున్నారు. డ్రగ్స్ పార్సిల్, కస్టమ్స్, ముంబై క్రైమ్ బ్రాంచ్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఆర్‌బీఐ, సీబీఐ,ఈడీ పేర్లతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్‌లో ఇంటరాగేషన్ చేస్తున్నామంటూ అందినంత దోచేస్తున్నారు. ఇలా ఈ ఏడాది 9 నెలల కాలంలో రాష్ట్రంలో 933 మంది నుంచి రూ.60 కోట్లు దోచేశారు. ప్రధానంగా రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలను టార్గెట్ చేసి వరుస మోసాలకు పాల్పడుతున్నారు. గతేడాది గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 3,037 డిజిటల్ అరెస్ట్ కేసులు నమోదు కాగా.. రూ.177 కోట్లు సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించింది. దేశవ్యాప్తంగా నమోదైన డిజిటల్ అరెస్ట్ కేసులను దర్యాప్తు చేయాలని సోమవారం సీబీఐని ఆదేశించింది. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది.
సౌత్‌ను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు
ప్రధానంగా ఢిల్లీ, ముంబయి, నోయిడా, గుర్‌గావ్, యూపీ, వెస్ట్‌బెంగాల్‌కు చెందిన సైబర్ ముఠాలు వరుస సైబర్ నేరాలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే తమ సైబర్ నేరాలను సౌత్ ఇండియాలోని ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు విస్తరించాయి. నార్త్ ఇండియాతో పోల్చితే సౌత్‌లో హిందీ మాట్లాడే వారి సంఖ్య తక్కువ. హైదరాబాద్ మినహా చాలా ప్రాంతాల వారికి హిందీ సరిగా అర్థం కాకపోవడంతో పాటు ఎదురు ప్రశ్నించరనే ధీమాతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈడీ, సీబీఐ, ఢిల్లీ, ముంబై పోలీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. బాధితులు తేరుకునే లోగా.. వారి పేరుతో ఫేక్ అరెస్ట్ వారెంట్స్, ఆర్బీఐ, ఈడీ నోటీసులు వాట్సాప్‌కి పంపిస్తున్నారు. ఈ ముఠాల చేతుల్లో చిక్కిన బాధితులు మానసిక క్షోభను
అనుభవిస్తున్నారు. ఒకానొక దశలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఆన్‌లైన్ ఇంటరాగేషన్,
డిజిటల్ అరెస్ట్ చేశామంటూ..
ప్రతి ఏటా సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో పాటు గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్ల సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు పోలీసులకు చిక్కకుండా వర్చువల్ ఫోన్ నంబర్స్, మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ వినియోగిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ చిక్కినా సైబర్ నేరగాళ్లు మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. ఢిల్లీ, ముంబై, యూపీ, కోల్‌కతా కేంద్రంగా వరుస నేరాలకు పాల్పడుతున్నారు. స్కైప్ లేదా వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లుగా పోలీస్ యూనిఫామ్‌తో వీడియో కాల్ చేస్తారు. డిజిటల్ అరెస్ట్‌లో భాగంగా ఆన్‌లైన్‌లో ఇంటరాగేషన్ చేస్తున్నట్లు నమ్మిస్తున్నారు. కాల్ కట్ చేసినా.. వెంటనే అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇలా ఇప్పటికే రాష్ట్రంలో నమోదైన డిజిటల్ అరెస్ట్ కేసుల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌లో నివాసముంటున్న ఓ ఏపీ ఎమ్మెల్యేకు ఈ నెల10న ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ కాల్ వచ్చింది. నకిలీ ఆధార్, సిమ్ కార్డులతో బ్యాంకు అకౌంట్లు తెరిచి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారంటూ బెదిరించారు. అనంతరం సైబర్ క్రైమ్ అధికారి విక్రమ్ నంటూ ఒకరు, సీబీఐ అధికారినంటూ మరొకరు వీడియో కాల్చేసి, అరెస్టు వారెంట్ చూపుతూ భయపెట్టారు. తమ విచారణకు సహకరించకుంటే అరెస్టు తప్పదంటూ హెచ్చరించారు. దీంతో భయాందోళనకు గురైన ఎమ్మెల్యే ఈ నెల 10 నుంచి15వ తేదీ మధ్య ఐదు రోజుల వ్యవధిలో సైబర్ నేరగాళ్లకు రూ.1.07 కోట్లు బదిలీ చేశారు. ఆ తర్వాత కూడా కోర్టు నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇప్పిస్తామని మరో రూ.60 లక్షలు ఇవ్వాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేశారు. దీంతో ఆ ఎమ్మెల్యే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏ మాత్రం అనుమానం వచ్చినా 1930కి కాల్ చేయండి
‘‘పోలీసులు, దర్యాప్తు సంస్థల విచారణలో ‘డిజిటల్ అరెస్ట్’ అనే పదం కూడా ఉండదు. పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థల పేరిట నోటీసులు వంపినా, కేసులు నమోదయ్యాయని బెదిరింపు వీడియోలు, కాల్స్ చేస్తే భయపడొద్దు. పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే 1930 లేదా www.cybercrime.gov.in ఫిర్యాదు చేయాలి. బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీలు షేర్ చేయవద్దు.’’
- శిఖాగోయల్, డైరెక్టర్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో
