- ఈ కేసులో కేసీఆర్, హరీశ్, కేటీఆర్‌ను ఇరికించే కుట్ర
- ఐపీఎస్‌లు హోంమంత్రి ఆదేశాలు పాటిస్తే భవిష్యత్‌లో చర్యలు తప్పవని కామెంట్
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ ను ఇరికించే కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఇప్పటిదాకా 350 మంది సాక్షులను విచారించినా చార్జిషీట్ దాఖలు చేయలేదన్నారు. సీరియల్లా సాగదీస్తూ.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రెండో సిట్ వేశారన్నారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఏ ప్రభుత్వంలోనైనా ఫోన్ ట్యాపింగ్ జరగడం కామన్ అన్నారు.
1885 ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ట్యాపింగ్ చట్టబద్ధమని పేర్కొన్నారు. ఎందుకు ట్యాప్ చేస్తున్నారు.. ఎవరి నంబర్లు ట్యాప్ చేస్తున్నారనే వివరాలు రాజకీయ నాయకులకు తెలియదని, వారికి సంబంధం ఉండదని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో గత అధికారులు ఎవరైనా తప్పు చేస్తే చట్టబద్ధంగా విచారణ జరపాలని, కానీ, తప్పుడు ఆధారాలు, తప్పుడు సాక్షులతో రాజకీయ నాయకులను ఇరికించాలని చూడడం సరైంది కాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ అత్యంత సీక్రెట్‌గా జరిగే ప్రక్రియ అని, కానీ, బాధ్యత తెలియని హోంమంత్రి(సీఎం) వల్ల డిపార్ట్మెంట్ నాశనమవుతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా పేర్కొన్న ప్రభాకర్ రావు అనే పోలీస్ అధికారిని 19 రోజుల పాటు విచారణ పేరుతో మానసికంగా హింసించారన్నారు.
కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్‌లను ఇరికించేందుకు.. 26 కేసులున్న సంధ్యా శ్రీధర్ రావు అనే వ్యక్తిని ప్రభుత్వం ప్రెజర్చేస్తున్నదని ఆరోపించారు. కేటీఆర్, హరీశ్ రావు ఇండ్ల వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలు, వారి ఫోన్లను హ్యాక్ చేయడానికి బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ప్రస్తుతం సిట్‌లో పనిచేస్తున్న అధికారులు, వారిపై అధికారులు.. చట్టం, పోలీస్ మాన్యువల్స్, సివిల్ కండక్ట్ రూల్స్ ప్రకారం పనిచేయకపోతే భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బాధ్యతలేని హోంమంత్రి ఆదేశాలను అధికారులు గుడ్డిగా పాటిస్తే.. భవిష్యత్‌లో వారిపై చర్యలు తప్పవన్నారు.

