మంత్రి ఎర్రబెల్లిని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మంత్రి ఎర్రబెల్లిని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసే వారినే పథకాలకు లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం అధికార దుర్వినియోగానికి పాల్పడడమేనని ఆరోపించారు. శనివారం ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 

మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఏకగ్రీవంగా మద్దతు తెలిపే గ్రామాల్లో దళితబంధు కేటాయించి.. ఎన్నికల్లో అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. వివాదాస్పదంగా లబ్ధిదారులను ఎంపిక చేసి.. ఎన్నికల్లో గెలిచి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు. 

మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీఆర్ఎస్ నీచపు బుద్ధి మానుకోవాలని హితవు పలికారు. మంత్రి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజా ప్రాతినిధ్య చట్టం-, ఇండియన్ పీనల్ కోడ్‌‌‌‌ను ఉల్లంఘించడమేనని అన్నారు.