కేసీఆర్​ పాలనలో విద్యా వ్యవస్థ నాశనం: ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్

కేసీఆర్​ పాలనలో విద్యా వ్యవస్థ నాశనం: ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్

హైదరాబాద్​, వెలుగు : సీఎం కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైందని బీఎస్పీ స్టేట్​చీఫ్ ఆర్ఎస్​ ప్రవీణ్ కుమార్  ఆరోపించారు. గురునానక్ యూనివర్సిటీలో స్టూడెంట్లు, తల్లిదండ్రుల ఆందోళనపై ఆయన స్పందించారు. కేసీఆర్ కనుసన్నల్లోనే నకిలీ యూనివర్సిటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని ప్రవీణ్​కుమార్​ శుక్రవారం ఓ వీడియో రిలీజ్ చేశారు. వర్సిటీ చాన్సలర్, గవర్నర్ తమిళిసై అనుమతి లేకుండానే గురునానక్, శ్రీనిధి, కావేరీ, నిక్ మార్ ఇంజనీరింగ్ కాలేజీ వంటి నకిలీ యూనివర్సిటీలు గత విద్యా సంవత్సరంలో వేల మంది స్టూడెంట్లకు అడ్మిషన్లు ఇచ్చి మోసం చేశాయన్నారు.

వాటిలో అడ్మిషన్లు పొందిన వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.  ‘విద్యాశాఖ మంత్రి సబితకు తెలియకుండానే రాష్ట్రంలో నకిలీ యూనివర్సిటీలు వెలిశాయా? ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఏం చేస్తున్నారు? ఆయనను, సబితను బర్తరఫ్ చేయాలి. నకిలీ వర్సిటీల్లో అడ్మిషన్లు ఇచ్చి, స్టూడెంట్లను మోసం చేసిన యాజమాన్యాలపై కేసులు నమోదు చేయాలి’ అని డిమాండ్​ చేశారు.