
- బహుజన రాజ్యంలో పూలే విద్యాభరోసా స్కీం తెస్తాం
- హనుమకొండ 'బహుజన విద్యార్థి గర్జన సభ'లో డిక్లరేషన్
హనుమకొండ, వెలుగు : ప్రజా గాయకుడు గద్దర్ స్మారకార్థం గద్దర్ ఫ్రీడం యూనివర్సిటీ ఏర్పాటు చేసి, తెలంగాణలోని వివిధ కళలపై తర్ఫీదు ఇస్తామని, తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి ఉద్యోగ హామీ స్కీంలో భాగంగా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. హనుమకొండ పబ్లిక్‌గార్డెన్ లో మంగళవారం నిర్వహించిన ‘బహుజన రాజ్యాధికారం కోసం బహుజన విద్యార్థి గర్జన’ సభలో స్టూడెంట్ డిక్లరేషన్ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఏ క్వశ్చన్ పేపర్లీకైనా బాధ్యులకు యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చట్టం తీసుకొస్తామన్నారు. పూలే విద్యా భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుడుతామని స్పష్టం చేశారు. స్టూడెంట్స్‌కు మెట్రో, ప్రభుత్వ బస్సుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. జిల్లాల్లో అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా సైనిక్‌స్కూల్స్, లలిత కళల స్కూల్స్ఏర్పాటు చేస్తామన్నారు. 600 పైచిలుకు మండలాల్లో అంతర్జాయతీ స్థాయి ప్రమాణాలతో స్కూళ్లు పెట్టి, గ్రామీణ ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. జాంబవంతుడి పేరు మీద స్టూడెంట్ స్పార్క్ సెంటర్స్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల గ్రామాల్లో ఏసీ, వైఫై ఫెసిలిటీస్ తో కోచింగ్‌సెంటర్లు పెడుతామని, రాష్ట్రంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తర్వాత నాలుగో భాషగా కంప్యూటర్ కోడింగ్ భాష నేర్పించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అవగాహన కల్పిస్తామన్నారు. ఉద్యోగ హక్కు చట్టం తీసుకొస్తామని, పండుగ సాయన్న నవ చేతన యువ సంఘాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 25 శాతం సంఘాలకు కేటాయిస్తామన్నారు. కాన్షీరాం విద్యార్థి నాయకత్వపు స్కీంలో 30 శాతం సీట్లు కేటాయించి, విద్యావంతులను షాడో మంత్రులుగా నియమిస్తామన్నారు. అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ సెంటర్ లో విద్యార్థి నవ చేతన సంఘాలకు రూ.15 లక్షలతో స్టార్టప్ కంపెనీలు పెట్టిస్తామన్నారు. గ్రామీణ యువకులకు 60 రోజులు స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ చేపట్టి, వారందరినీ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వాములను చేస్తామన్నారు. ఎవరెస్ట్ ఎక్కిన ‘పూర్ణా-ఆనంద్’ స్కీం పెట్టి ప్రతి స్పోర్ట్స్‌మెన్‌కు స్పోర్ట్స్షూస్, స్మార్ట్‌వాచ్, ట్రాక్‌షూట్ ఇస్తామన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపేవారికి కిట్స్, నెలవారీగా 15వేల స్టైఫండ్ ఇస్తామని, అంతర్జాతీయ , ఒలంపిక్ పథకాలు తెస్తే రూ.కోటి నగదు, 500 నుంచి వెయ్యి గజాల స్థలం ఇస్తామన్నారు. ఐపీఎల్, ప్రో కబడ్డీ మాదిరిగానే తెలంగాణ స్కూల్, కాలేజీ స్పోర్ట్స్లీగ్ లు పెట్టి విద్యార్థులను ఒలింపిక్స్ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలకు డ్రైవింగ్తప్పనిసరి చేయడంతో పాటు స్విమ్మింగ్ తప్పనిసరి చేస్తామన్నారు.
లాక్కున్న భూములను పేదలకు పంచుతం
తెలంగాణ సర్కారు 30 వేల ఎకరాల అసైన్డ్ భూములను పేదల నుంచి గుంజుకుని పెద్దలకు పంచిందని, తమ ప్రభుత్వం వచ్చాక వీటిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇకనైనా ప్రజల భూములను వేలం వేయడం ఆపాలని, ఇప్పటివరకు తీసుకున్న భూములను తిరిగి వాళ్లకు అప్పగించాలని డిమాండ్ చేశారు. గద్దర్ మరణ వార్త అసెంబ్లీ సెషన్ కొనసాగుతుండగానే అందరికీ తెలిసిందని, అయినా అసెంబ్లీలో ప్రకటన చేసి ఆయనకు నివాళులర్పించకపోవడం బాధాకరమని అన్నారు. గద్దర్ అంత్యక్రియలకు జనం లక్షల్లో తరలివచ్చారని, అరకొర వసతుల వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. కిలోమీటర్ల మేర సాగిన అంతిమయాత్రలో ఎక్కడా కనీసం నీళ్లు, అంబులెన్స్ సౌకర్యం కల్పించలేదని, కవులు, కళాకారులకు మినిమం ఫెసిలిటీస్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా.. అని ప్రశ్నించారు.