వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

వచ్చే ఎన్నికల్లో  ఒంటరిగానే పోటీ చేస్తం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో  వచ్చే అసెంబ్లీ ఎన్నిక‌‌ల్లో త‌‌మ పార్టీ ఒంట‌‌రిగానే పోటీ చేస్తుంద‌‌ని బీఎస్పీ ప్రకటించింది. ఈ విషయాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ శనివారం ట్విట్టర్​లో వెల్లడించారు. కాంగ్రెస్ తో బీఎస్పీ పొత్తు వార్తా కథనాలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. మే 7న బీఎస్పీ చీఫ్ మాయావతి సరూర్ నగర్ స్టేడియంలో  చేసిన ప్రకటనకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో  దొరల పాలనను అంతమొందించి బహుజన రాజ్య స్థాపనే లక్ష్యంగా  పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

భావసారూప్య పార్టీలతో పొత్తుపై ఆలోచిస్తామని చెప్పారు. 17ఏండ్లు హోంగార్డుగా సేవలందించిన రవీందర్‌‌ మృతి దురదృష్టకరమని ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇచ్చిన రెగ్యులరైజ్ హామీ అమలైవుంటే రవీందర్ బ్రతికి ఉండేవాడని తెలిపారు. మృతుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి, ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హోంగార్డులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాడి హక్కులు సాధించుకోవాలని కోరారు. రాష్ట్రంలోని 20వేల మంది హోంగార్డుల పక్షాన బీఎస్పీ పోరాడుతుందని పేర్కొన్నారు.