దళిత బంధు పేరుతో సీఎం మభ్యపెడుతున్నరు

దళిత బంధు పేరుతో సీఎం మభ్యపెడుతున్నరు
  • సంగారెడ్డి స్వేరోస్‌‌ మీటింగ్‌‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  • ఓట్ల కోసం దళిత సీఎం అంటరు.. వాళ్లను మళ్లా రానీయొద్దు
  • 29 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నా దళితులపై అన్యాయాన్ని ప్రశ్నిస్తలేరు

సంగారెడ్డి టౌన్, వెలుగు: ‘హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం దళిత బంధు పథకం పేరుతో రూ. వెయ్యి కోట్లు ఇస్తానని సీఎం కేసీఆర్ మభ్యపెడుతున్నారు. అవే నిధులను గురుకులాల కోసం కేటాయిస్తే ఎంతో మంది పిల్లలు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతారు’ అని మాజీ ఐపీఎస్‌‌ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అవే పైసలతో దళిత పిల్లలను అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు పంపించి చదివిస్తే ఇంటికో సత్య నాదెళ్ల, సుందర్​పిచాయ్‌‌ లాంటి గొప్ప వ్యక్తులు తయారవుతారని చెప్పారు. ఓట్ల కోసం దళిత ముఖ్యమంత్రి అని మభ్యపెడతారని, అట్లాంటి వాళ్లను మళ్లీ రానీయొద్దని అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌‌లో స్వేరోస్ జిల్లా సమావేశానికి ప్రవీణ్​ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని సగం గురుకులాలకు నేటికీ సొంత భవనాలు లేవన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రంలో దళితులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1980 వరకు సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఒక్క జడ్జి కూడా లేరని.. ఇప్పటికీ సెంట్రల్ వర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు 2 శాతం కూడా లేరంటే మనమెక్కడున్నామో అర్థం చేసుకోవాలని చెప్పారు.

కేసులు పెడ్తే భయపడేది లేదు
‘ఎన్నికలు వచ్చినప్పుడల్లా దళిత సీఎం అనో.. ఇంకోటనో మభ్య పెడ్తున్నరు. బీరు, బిర్యానీ, వెయ్యి, రెండు వేలు, ఐదు వేలు ఇస్తూ ఓట్లు వేయించుకుంటున్నారు. వాళ్లు అధికారంలో ఉంటూ మనల్ని కన్ఫ్యూజ్‌‌​చేస్తూ ఊరికి దూరం పెడుతున్నారు. ఇలా ఎంతకాలం? ఇలాంటి పరిస్థితి ఇక రానివ్వొద్దు. బహుజన రాజ్యం స్థాపించేదాకా మడమ తిప్పొద్దు. దళితులకు నిజమైన అభివృద్ధి, అధికారం కావాలి. అలంపూర్ టు ఆదిలాబాద్ గల్లీ, గుడిసెల వరకు ఈ విషయాన్ని తీసుకెళ్లాలి’ అని స్వేరోస్ టీమ్‌‌కు ప్రవీణ్​కుమార్ సూచించారు. రిటైరైన తెల్లారే తనపై ​కేసు పెట్టారని, వాటికి భయపడేది లేదన్నారు. దళిత బిడ్డగా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకే తాను రాజీనామా చేసి వచ్చానని, ఒంటరి పోరాటానికి రెడీ అయ్యాయని చెప్పారు. 

ప్రవీణ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌పై కేసు నమోదు
కరీంనగర్ క్రైం, వెలుగు: హిందూ దేవతలను అవమానిస్తూ ప్రతిజ్ఞ చేసిన ప్రవీణ్ కుమార్‌‌‌‌‌‌‌‌పై కరీంనగర్‌‌‌‌‌‌‌‌ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయవాది మహేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి వేసిన పిటిషన్ మేరకు కేసు పెట్టాలని కోర్టు ఆదేశించడంతో శుక్రవారం కేసు నమోదైంది.