ప్రగతి భవన్ కుర్చీ గుంజుకునుడే: ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్

ప్రగతి భవన్ కుర్చీ గుంజుకునుడే: ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్
  • ప్రగతి భవన్ కుర్చీ గుంజుకునుడే
  • కేటీఆర్ టీఎస్‌‌పీఎస్సీ పేపర్లు అమ్ముకున్నడు: ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్

మెట్ పల్లి/జగిత్యాల టౌన్, వెలుగు: సీఎం కేసీఆర్​దోపిడీ దొంగల పాలన చేస్తూ పేదలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్​ప్రవీణ్‌‌ కుమార్​ఆరోపించారు. తెలంగాణ నుంచి కేసీఆర్​ను సాగనంపి.. ప్రగతి భవన్ కుర్చీ గుంజుకుందామని పిలుపునిచ్చారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో బహుజన రాజ్యాధికార గర్జన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 75 ఏండ్లుగా దొరల చేతుల్లో బందీ అయిన తెలంగాణను విముక్తి చేసి బహుజనుడు బరాబర్ సీఎం కావాల్సిందే అన్నారు.  

కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్.. ఒక్కో పేపర్ కు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు అమ్ముకున్నాడని ఆరోపించారు. ముస్లింలకు12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేశాడని విమర్శించారు. బీఎస్పీ అధికారంలోకి వేస్తే 5 వేల కోట్లతో గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. మెట్ పల్లి మండలం మెట్లచిట్టాపూర్ లో 400 ఎకరాల భూమిని స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి కేసీఆర్ గుంజుకుని ఇథనాల్ ఫ్యాక్టరీ కట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీలను రీఓపెన్ చేస్తామని భరోసా ఇచ్చారు. కేటీఆర్ టీఎస్​పీఎస్సీ పేపర్లు అమ్ముకొని నిరుద్యోగుల జీవితాలను నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వర్ధన్నపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకులు జగన్నాథ రెడ్డి, అంజన రెడ్డి, మాజీ జడ్పీటీసీ పూదరి అరుణ బీఎస్పీలో చేరారు.  

మేమొస్తే టీఎస్​పీఎస్సీ రద్దు

బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తొలిరోజే టీఎస్​పీఎస్సీ బోర్డును రద్దు చేస్తూ తొలి సంతకం చేస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాలలో పార్టీ ఆఫీస్‌‌ను ప్రారంభించి మాట్లాడారు. గ్రూప్ 2 వాయిదా పడిందన్న కారణంతో ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక మృతిని మంత్రి కేటీఆర్ రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు.