కూల్ గా రూ.2 వేల నోట్లు మార్చేస్తున్నారు.. స‌గంపైనే వ‌చ్చేశాయ్

కూల్ గా రూ.2 వేల నోట్లు మార్చేస్తున్నారు.. స‌గంపైనే వ‌చ్చేశాయ్

రద్దు అయిన రూ.2వేల నోట్లలో 2/3 వంతు బ్యాంకులకు చేరాయని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ చెప్పారు. బ్యాంకుల్లో 2.41 లక్షల కోట్ల విలువైన 2000 నోట్లు జమ అయినట్లు వెల్లడించారు.  గతంలో రూ.3.62 లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లు చెలామణిలో ఉండగా.. వీటిలో 2.41 లక్షల కోట్ల విలువైన నోట్లు బ్యాంకులకు చేరాయి. అంటే మొత్తం నోట్లలో 2/3వంతుకుపైగా తిరిగి వచ్చినట్లైంది.

రెండు వేల నోట్లను రద్దు చేసిన నెల రోజుల్లోనే ఇంత భారీ స్థాయిలో నోట్లు తిరిగి బ్యాంకులకు వచ్చాయని శక్తి కాంత్ దాస్​ చెప్పారు. తిరిగి వచ్చిన వాటిలో 85 శాతం డిపాజిట్లలో, మిగతావి కరెన్సీ మార్పిడిలో ఉన్నాయని వివరించారు. నోట్​ రీకాల్​ వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని వివరించారు. 

సెప్టెంబర్ 30వ తేదీ వరకు 2 వేల నోట్ల మార్పిడికి అవకాశం ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంతో నిదానంగా.. కూల్ గా మార్చుకుంటున్నారు జనం. ఎక్కువ మంది తమ బ్యాంక్ అకౌంట్లలో 2 వేల నోట్లను డిపాజిట్ చేస్తున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే అకౌంట్ లేకుండా నోట్లను మార్చుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది. 

మొదట్లో పెద్దగా హైరానా పడిన జనం.. ఆ తర్వాత చాలా కూల్ గా ఉన్నారు. హడావిడి, ఆందోళన లేకుండా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. కొందరు వ్యాపారులు అయితే తమ బిల్లింగ్ చెల్లింపులకు 2 వేల నోట్లను ఉపయోగిస్తున్నారు. బ్యాంకుల్లో ఈజీగా మార్చుకనే అవకావం ఉండటంతో.. వ్యాపారులు సైతం వాటిని అంగీకరిస్తున్నారు. కొంత మంది అయితే 2 వేల నోట్లపై ఆఫర్స్ కూడా ప్రకటించటం విశేషం.