రామరాజ్యం రాబోతున్నది: ఆర్ఎస్ఎస్​ చీఫ్​మోహన్​ భగవత్​

రామరాజ్యం రాబోతున్నది: ఆర్ఎస్ఎస్​ చీఫ్​మోహన్​ భగవత్​

అయోధ్య:  దేశంలో రామరాజ్యం రాబోతున్నదని, ప్రతి ఒక్కరూ వివాదాలకు దూరంగా, ఐక్యంగా ఉండాలని ఆర్‌‌ఎస్‌‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఆయన మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక తపస్వి అని, ప్రాణప్రతిష్ఠకు ముందు ఆయన కఠినమైన ఉపవాసదీక్ష చేపట్టారని గుర్తు చేశారు. మనం కూడా మనవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

అయోధ్యలో రామ్ లల్లాతో భారత్ ప్రతిష్ఠ తిరిగి వచ్చినట్లయిందన్నారు. ప్రపంచానికి మార్గదర్శనం చేసే నయా భారత్ కచ్చితంగా ఉద్భవిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాముడి కోసం కోట్లాది గళాలు స్మరించాయన్నారు. రాముడు ధర్మం, త్యాగనిరతికి ప్రతీక అని గుర్తు చేశారు. అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లడమే మన ధర్మం అన్నారు. పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని వెల్లడించారు.  

ఎంతో మంది కృషి వల్ల రామ్​లల్లా 500 ఏళ్ల తర్వాత సొంతి ఇంటికి తిరిగి వచ్చారని, వారి త్యాగానికి  వందనం అని భగవత్ అన్నారు. ‘‘ అయితే రాముడు అయోధ్యలో వివాదాల వల్లే వెళ్లిపోయాడు. వివాదాలు తొలగి ఇప్పుడు రామరాజ్యం వస్తున్నది. చిన్న విషయాలపై మనలో మనం పోరాడటం మానే యాలి. మనం అహంకారాన్ని విడిచిపెట్టి ఐక్యంగా ఉండాలి” అని కోరారు. రాముడు అన్ని చోట్లా ఉన్నాడని తెలుసుకుని, మనలో మనం సమన్వయాన్ని ఏర్పరచుకోవాలని సూచించారు. కలిసి జీవించడం అనేది మతం మొదటి అసలైన ప్రవర్తన అని, ప్రజలు తాము సంపాదించిన దాంట్లో  తమ కోసం కొంత ఉంచుకోవాలని, మిగిలిన మొత్తాన్ని దాతృత్వానికి ఖర్చు చేయాలని ప్రజలను కోరారు.