- హైదరాబాద్‌లో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- బస్సు ప్రమాదాల్లో ఏటా 300 మంది వరకు మృతి
హైదరాబాద్/ కోరుట్ల, జగిత్యాల టౌన్, వెలుగు: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే ఐదు బస్సు ప్రమాదాలు జరిగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు, ఖమ్మం, నిర్మల్‌లో ఒక్కో యాక్సిడెంట్ జరగగా.. హైదరాబాద్ సిటీ బస్సు కింద పడి ఓ యువతి చనిపోయింది.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణ శివారులో మంగళవారం తెల్లవారుజామున ఎలక్ట్రిక్ బస్సు నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తూ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 10 మందికి గాయాలయ్యాయి. ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో బస్సులో 12 మంది ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.
స్కూల్ వ్యాన్ను బస్సు ఢీకొని.. ఇద్దరు స్టూడెంట్లకు గాయాలు
జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్ వద్ద మంగళవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టింది. స్కూల్ బస్సు విద్యార్థులతో రోడ్డు దాటుతుండగా, పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో 20 మంది విద్యార్థులు ఉండగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
ఎలక్ట్రిక్, అద్దె బస్సుల వల్లే ఎక్కువ
ఎలక్ట్రిక్, అద్దె బస్సుల వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు నడపడంలో డ్రైవర్లకు సరైన శిక్షణ లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. అద్దె బస్సు డ్రైవర్లు కూడా బయటివారు కావడంతో సంస్థకు సంబంధం లేదని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. అయితే బస్సు ఆర్టీసీ సంస్థలో నడుస్తుండగా.. సంస్థ అధికారులు మాత్రం అద్దె బస్సు అని తేలిగ్గా తీసుకుంటున్నారు.
నష్టపరిహారంగా ఏటా 75 కోట్ల చెల్లింపు
ఆర్టీసీ బస్సు ప్రమాదాల వల్ల రాష్ట్రంలో ఏటా 300 మంది వరకు చనిపోతున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మరో వెయ్యి మంది వరకు గాయాలపాలై, ఇందులో కొందరు జీవితాంతం అంగవైకల్యంతో బాధపడుతున్నారు.ఈ ప్రమాదాల కోసం సంస్థ నష్టపరిహారంగా ఏటా సగటున రూ.75 కోట్లు చెల్లిస్తోంది.
రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా 70 నుంచి 80 శాతానికి పైగా టూవీలర్ పై వెళ్లేవారు, పాదచారులే ఉంటున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం సంస్థ ఆదాయంపైనే కాకుండా ‘సురక్షిత ప్రయాణం’పై కూడా దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
