ఏపీ-తెలంగాణ మధ్య మొదలు కాని బస్సులు.. సమస్యపై స్పందించిన ఏపీ సీఎం జగన్

ఏపీ-తెలంగాణ మధ్య మొదలు కాని బస్సులు..  సమస్యపై స్పందించిన ఏపీ సీఎం జగన్

న్యాయ సలహా కోరాలని మంత్రులకు సూచన

విజయవాడ:  ఏపీ- తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం కాని విషయంపై ముఖ్యమంత్రి జగన్  స్పందించారు. అవసరమైతే న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్లాలని జగన్ సూచించారు. అన్ లాక్ 4  ప్రారంభమైనా ఏపీ-తెలంగాణ మధ్య బస్సులు ప్రారంభం కాలేదని.. తెలంగాణకు బస్సులు నడిపే అంశం ఏం చేయాలని మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ ఇవాళ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి సూచనలు చేసినట్లు  సమాచారం. హైదరాబాద్ తోపాటు.. తెలంగాణలోని ఇతర ముఖ్య ప్రాంతాలన్నింటికీ బస్సులు నడవకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. అసలే రైళ్లు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో కనీసం బస్సులైనా లేకపోవడం పేదలను.. సామాన్యులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపినా.. కొలిక్కి రావడం లేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉందని మంత్రులు వివరించినట్లు తెలుస్తోంది. దీనిపై వెంటనే స్పందించి సీఎం జగన్ హైదరాబాద్‌తో పాటు అన్ని ప్రాంతాలకు వెంటనే ఆర్టీసీ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని.. ఈ విషయంలో అవసరమైతే న్యాయసలహా తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.