ఆర్టీసీ సర్వీసులు బంద్.. అదే బాటలో ప్రైవేట్ ట్రావెల్స్

ఆర్టీసీ సర్వీసులు బంద్.. అదే బాటలో ప్రైవేట్ ట్రావెల్స్

మచిలీపట్నం: జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ సర్వీసులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పేర్ని వెంకట్రామయ్య అన్నారు. ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేస్తున్నామని చెప్పారు. శనివారంరాత్రి నుండే దూర సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నామన్నారు.

కరోనా వ్యాప్తి నివారణ చర్యలలో  భాగంగా ప్రధాని మోదీ స్వచ్చంద జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు మంత్రి. ప్రైవేట్ సర్వీస్లను కూడా నిలిపి వేయాలని కోరామని,  ఇందుకు ప్రయాణీకులంతా సహకరించాలని కోరారు. తిరిగి ఆదివారం రాత్రి నుండి సర్వీసులన్నింటినీ పునరుద్ధరిస్తామని చెప్పారు.

వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఆ రాష్ట్ర సరిహద్దుల్లో ప్రైవేట్ వాహనాల రాకపోకలను నిలిపి వేసిందని పేర్ని వెంకట్రామయ్య చెప్పారు.  కేవలం ఆర్టీసీ బస్సులకు మాత్రమే వారు అనుమతిస్తున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ నుండి తమిళనాడు వెళ్లే ప్రయాణీకులు తమ ప్రయాణాలు మానుకోవాలన్నారు.  ఒకవేళ వెళితే ఆ రాష్ట్ర సరిహద్దుల్లోనే మీ వాహనాలను నిలిపి వేసి స్క్రీని టెస్ట్లు చేయించుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో వెళ్లాలని చెప్పారు.  ఇన్ని ఇబ్బందుల నేపథ్యంలో తమిళనాడుకు ప్రయాణం మానుకుంటే ఉత్తమమన్నారు మంత్రి.

ప్రైవేట్ ట్రావెల్స్ కూడా బంద్

ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వహకులు కూడా  ఈ రోజు రాత్రి నుంచి మొత్తం ట్రావెల్స్ బంద్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అన్ని రూట్ల సర్వీసులు రద్దు చేశామని, కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో  ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు జనతా కర్ఫ్యూ లో పాల్గొంటున్నామని చెప్పారు.

కరోన వైరస్ ప్రభావంతో గత ఐదారు రోజుల నుంచి తమకు వ్యాపారం లేదని, జనం దూర ప్రయాణాలకు ఆసక్తి చూపడం లేదన్నారు. ఫోన్ కాల్స్ కూడా చాలా వరకూ తగ్గాయని చెప్పారు.  ప్రయివేటు ట్రావెల్స్ కు కరోన ప్రభావం తీవ్రంగా ఉందన్నారు.