
బస్ పాస్ రాయితీ బకాయిలు, జీహెచ్ఎంసీ నిధులు ఇవ్వట్లేదు
కార్మికుల బలవన్మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే
సర్కారుతో మాట్లాడుతానని గవర్నర్ హామీ ఇచ్చారు
అశ్వత్థామరెడ్డి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఆర్టీసీని నిర్లక్ష్యం చేస్తోందని, అందువల్లే సంస్థ భారీగా నష్టాల పాలవుతోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఆర్టీసీ జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ తీరు సరికాదని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన సొమ్ము, రాయితీల బకాయిలను సంస్థకు చెల్లించడం లేదని వివరించారు. ఆర్టీసీ సమ్మెపై సోమవారం జేఏసీ నేతలు 16 మంది రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైను కలిశారు. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మె పరిస్థితి, ప్రభుత్వ తీరు, ఇతర పరిణామాలను గవర్నర్‌కు వివరించారు. దీనిపై ఓ రిపోర్టును అందజేశారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఆర్టీసీ నష్టాలు రూ.3,500 కోట్లకు చేరుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చే నష్టాలను జీహెచ్ ఎంసీ భరిస్తుందంటూ సీఎం జీవో విడుదల చేశారు.
జీహెచ్ఎంసీ నుంచి రూ.1,492.70 కోట్లు రావాల్సి ఉంది. బస్ పాస్ రాయితీల కింద రూ.2,809 కోట్లు రావాల్సి ఉంటే.. ఇప్పటిదాకా రూ. 649 కోట్లే ఇచ్చారు. పెరిగిపోతున్న డీజిల్ ధరల వల్ల ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయి. కార్మికుల పీఎఫ్ నిధులు రూ.1,450 కోట్లను మేనేజ్మెంట్ వాడుకుంది. రిటైరైన కార్మికులకు బెనిఫిట్స్ చెల్లించడం లేదు. ఐదేండ్లలో 7,444 మంది ఉద్యోగులు రిటైరైతే.. ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి? 2018 జూన్ లో ఆర్టీసీపై స్టడీ చేసేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నివేదిక సిద్ధమైనా ప్రభుత్వం దానిని అడగటం లేదు. ఆర్టీసీ ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని, 50 శాతం ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తామని సీఎం వెల్లడించారు’’ అని అందులో పేర్కొన్నారు. తర్వాత జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు.
సర్కారుదే బాధ్యత..
సమ్మె ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్ కు వివరించామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. కార్మికుల ఆత్మహత్యలు, మహిళా కార్మికుల పట్ల పోలీసుల ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు, పేపర్ క్లిప్ లను సీడీల రూపంలో అందచేశామని చెప్పారు. గవర్నర్ సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వంతో మాట్లాడుతామన్నారని వివరించారు. ఆదివారం ఖమ్మంలో కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని ఆర్టీసీ డిపో వద్దకు కూడా తీసుకెళ్లనీయలేదని, హిందూ సంప్రదాయాలకు భిన్నంగా అంత్యక్రియలు అయ్యేలా ప్రభుత్వం ఒత్తిడి చేసిందని చెప్పారు. టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు రాసిన లేఖను అశ్వత్థామరెడ్డి స్వాగతించారు. ఆయన ప్రభుత్వంతో చర్చలకు మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. ఎర్రబెల్లి దయాకర్ రావు 2015లో ఆర్టీసీకి మద్దతిచ్చి, ఇప్పుడు మంత్రిగా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని మంత్రులు రోజుకో విధంగా మాట్లాడుతూ కార్మికులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ సంఘాలకు చెప్పినం
ఉద్యోగ సంఘాల నేతలకు అన్ని సమస్యలు వివరించామని, తాము ఢిల్లీలో ఉన్నట్టు కారం రవీందర్ రెడ్డి చెప్పారని అశ్వత్థామరెడ్డి చెప్పారు. వారు సీఎంను కలవడాన్ని తాము తప్పుపట్టటం లేదని, కలిసిన సందర్భాన్ని తప్పు పడుతున్నామన్నారు. డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి చనిపోవటంతో ఆదివారం ఉద్యోగ సంఘాల సమావేశానికి నేతలు వెళ్లలేదని, వారి ఫోన్ కోసం ఎదురుచూస్తున్నామని వివరించారు. ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని 8వ తేదీ వరకు వేచి చూశామని, తర్వాతే పార్టీల నేతలను కలిశామన్నారు.
మంత్రుల మాటలు సరికాదు
మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడుతుండటం వల్లే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డి అన్నారు. సమ్మెపై గవర్నర్ కొన్ని ప్రశ్నలు అడిగారని, ఆయా అంశాలు వివరించామని తెలిపారు. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని కోరారు. కార్మికులపై ప్రభుత్వ బెదిరింపులు సాగుతూనే ఉన్నాయని జేఏసీ కో కన్వీనర్ వీఎస్ రావు అన్నారు. విమర్శలు మానుకొని చర్చలకు పిలవాలన్నారు. గవర్నర్‌ను కలిసినవారిలో థామస్ రెడ్డి, సుధ, బీవీరెడ్డి, శేఖర్ రెడ్డి, తిరుపతి, వాసుదేవరావు, బాబు ఉన్నారు.