డ్యూటీలో చేరనీయట్లేదని కండక్టర్ ​ఆత్మహత్యాయత్నం

డ్యూటీలో చేరనీయట్లేదని కండక్టర్ ​ఆత్మహత్యాయత్నం

మెదక్టౌన్, వెలుగు: ఒకవైపు మూడు నెలలుగా జీతం రాక ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడం… మరోవైపు సమ్మె విరమించి ఉద్యోగంలో చేరతామన్నా అధికారులు నిరాకరిస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఆర్టీసీ కండక్టర్​ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన బుధవారం జిల్లా కేంద్రమైన మెదక్​లో జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన మైసయ్య పదిహేను సంవత్సరాలుగా మెదక్​ఆర్టీసీ డిపోలో కండక్టర్​గా పని చేస్తూ పట్టణంలోని జంబికుంట వీధిలో అద్దెకు ఉంటున్నాడు. మూడు నెలలుగా జీతం రాక కుటుంబ పోషణ భారంగా మారింది.  ఇంటి కిరాయి కట్టేందుకు, నిత్యావసర సరుకులకు, కాలేజీకి వెళ్తున్న కూతురు బస్సు ఛార్జీలకు పైసలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆర్థిక ఇబ్బందులకు తోడు సమ్మె విరమించినా డ్యూటీలో చేర్చుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన మైసయ్య బుధవారం సాయంత్రం ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఇరుగుపొరుగు సహకారంతో స్థానిక జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మైసయ్యను పరీక్షించిన డాక్టర్లు ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్​గాంధీ ఆసుపత్రికి రెఫర్​ చేశారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు సుభాష్​చంద్రబోస్​, రవీందర్​, సుబ్బారావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం తదితరులు ఆసుపత్రికి వచ్చి మైసయ్య ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఖరే ఆత్మహత్య యత్నానికి కారణమని వారు ఆరోపించారు.