- మంత్రులతో కార్మిక జేఏసీ చర్చలు సఫలం11% పీఆర్సీకి ప్రభుత్వం ఓకే ..
- గుర్తింపు సంఘం ఎన్నికలకూ గ్రీన్‌సిగ్నల్
- ప్రభుత్వంలో ఆర్టీసీవిలీనానికి అధికారులు, కార్మిక నాయకులతో కమిటీ
- సమ్మె విరమిస్తున్నట్టు కార్మిక సంఘాల జేఏసీ ప్రకటన
- మార్నింగ్ షిఫ్టు నుంచి యథావిధిగా బస్సులు
- 3 రోజుల సమ్మె ముగియడంతో ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు
హైదరాబాద్, వెలుగు:మంత్రులతో ఆర్టీసీ కార్మికులు జరిపిన చర్చలు ఫలించాయి. ప్రధాన డిమాండ్లకు సర్కారు ఓకే చెప్పడంతో సమ్మె విరమిస్తున్నట్టు శుక్రవారం అర్ధరాత్రి కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. దీంతో శనివారం ఉదయం షిఫ్టు నుంచి బస్సులన్నీ యథావిధిగా రోడ్డెక్కాయి. 3 రోజుల సమ్మెకు ఎట్టకేలకు ముగింపు పలకడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
సెక్రేటేరియెట్ వేదికగా శుక్రవారం ఉదయం11 గంటల నుంచి లంచ్ వరకు అధికారులతో, ఆ తర్వాత అర్ధరాత్రి 12 గంటల వరకు మంత్రులతో 2 దశల్లో సుమారు 13 గంటలపాటు జేఏసీ నేతలు చర్చలు జరిపారు. మొత్తం 32 డిమాండ్లపై కార్మిక నేతలు పట్టుబట్టగా, ప్రధానంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఎలక్ట్రిక్బస్సుల నిర్వహణ, వేతన సవరణ, యూనియన్లకు అనుమతి తదితర నాలుగైదు అంశాలపైనే పీటముడి పడినట్టు తెలిసింది.
విలీన ప్రక్రియ ఇప్పటికిప్పుడు తేల్చే అంశం కాకపోవడంతో కమిటీ వేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం, ఎలక్ట్రిక్బస్సుల అంశం కేంద్రం పరిధిలో ఉందని స్పష్టత ఇచ్చింది. ఇవి తప్ప మిగిలిన డిమాండ్లన్నింటికీ , ముఖ్యంగా11 శాతం పీఆర్సీ, గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఒకే చెప్పడంతో సమ్మె విరమణకు జేఏసీ నేతలు అంగీకరించారు.
పరిష్కారం దిశగా విలీన సమస్య
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పీఆర్సీ, యూనియన్లకు అనుమతి, ఎలక్ట్రిక్బస్సులను ఆర్టీసీ నిర్వహించడం.. తదితర 32 డిమాండ్లతో ఈ నెల 22 న మొదటి షిఫ్టు నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. గురువారం నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో అప్రమత్తమైన సీఎం రేవంత్‌రెడ్డి గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీతో చర్చల కోసం ప్రత్యేకంగా మంత్రుల కమిటీని నియమించారు. ఈ క్రమంలో సెక్రటేరియట్‌లో శుక్రవారం ఉదయం 11. 30 గంటలకు ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీతో జేఏసీ నేతలు ముందుగా చర్చలు జరిపారు.
లంచ్ బ్రేక్ వరకు సాగిన చర్చల్లో ఐఏఎస్ అధికారుల ముందు జేఏసీ నేతలు తమ డిమాండ్లను ఉంచారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆయన చాంబర్‌లోనే జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఈ చర్చల్లో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సీనియర్ ఐఏఎస్ అధికారులు వికాస్‌రాజ్, దాన కిశోర్, సందీప్ కుమార్ సుల్తానియా, నాగిరెడ్డి పాల్గొన్నారు. చర్చలు ప్రారంభానికి ముందు డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
పెండింగ్ సమస్యలు పరిష్కరించింది: జేఏసీ నేతలు
తమ దశాబ్దాల పెండింగ్ సమస్యలను ప్రజా ప్రభుత్వమే తీర్చిందని ఆర్టీసీ సంఘాల నేతలు చర్చల సందర్భంగా తెలిపారు. గత ప్రభుత్వంలో 55 రోజులపాటు సమ్మె చేసినా.. తమకు ఎలాంటి హామీ లభించలేదని, ప్రజా ప్రభుత్వం రాగానే ఈ రెండున్నరేండ్ల కాలంలో 2017 సంవత్సరం పీఆర్సీ ఇచ్చిందని, పెండింగ్ డీఏలు లేకుండా చేసిందని చెప్పారు.
సర్వీసు నుంచి శాశ్వతంగా రిమూవ్ అయిన 270 మందికి త్రిసభ్య కమిటీ ద్వారా ఉద్యోగాలు ఇచ్చారని , సీసీఎస్, పీఎఫ్ బకాయిలు తీర్చిందని చర్చల సందర్భంలో మంత్రుల ముందు ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పుకొచ్చారు. యూనియన్లు లేకపోవడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి చేసిన అనేక కార్మిక సంక్షేమ కార్యక్రమాలకు తగిన ప్రచారం రాలేదని మంత్రులకు జేఏసీ నేతలు వివరించారు. చర్చల సందర్భంగా ఆర్టీసీకి సంబంధించిన అన్ని సంఘాల నేతల అభిప్రాయాలను మంత్రులు వివరంగా నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత ప్రారంభమైన చర్చలు 7 గంటలకుపైగా సాగాయి. ఈ చర్చల్లో జేఏసీ నేతలు 32 డిమాండ్ల ను మంత్రుల ముందుంచారు.
ప్రధానంగా ఆర్టీసీ విలీనం, యూనియన్ల పునురద్ధరణ, పీఆర్సీ ప్రకటన, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ఆధ్యర్యంలోనే నడపాలనే డిమాండ్లపై సుదీర్ఘ చర్చ సాగింది. జేఏసీ నేతల డిమాండ్లలో కొన్నింటికి మంత్రుల కమిటీ ఓకే చెప్పినా.. మరికొన్ని డిమాండ్లకు సీఎం ఆమోదం రావాల్సి ఉండడంతో చర్చలు కాస్త ఆలస్యమయ్యాయి. మొత్తం మీద సమ్మెతో దశాబ్దాల విలీన సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌పై ప్రభుత్వం అధికారులు, ఆర్టీసీ సంఘాల నేతలతో కమిటీ వేస్తామని ప్రకటించడంతో ఆ నివేదిక ఆధారంగా విలీన ప్రక్రియ సాగనున్నది.
ఆర్టీసీని కాపాడుకుందాం: డిప్యూటీ సీఎం భట్టి
ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ‘‘ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ మరణించడం చాలా బాధా కరం. వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే, ప్రాణం అనేది అత్యంత విలువైనది. శంకర్ గౌడ్ మరణంతో ఆ కుటుంబం పరిస్థితి మొత్తం తలకిందులైంది. ఇలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తరఫున మేం, కార్మిక సంఘాల నేతలుగా మీరు సమష్టిగా కార్మికులకు పిలుపునిద్దాం” అని విజ్ఞ ప్తి చేశారు.
సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప, ప్రాణాలు తీసుకోవడం సరైన నిర్ణయం కాదని, సమస్య ఎంత క్లిష్టమైనదైనా.. కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం లభిస్తుందని అన్నారు. ‘‘ఇది మన ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం. తెలంగాణలో ఎవరినీ శత్రువులుగా చూసే స్వభావం మా ప్రభుత్వానికి లేదు. ఆర్టీసీ అనేది మన రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. మన సంస్థను మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లపాటు ఆర్టీసీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నదని, పాలనాపరంగా సంస్థ చిన్నాభిన్నమైందని అన్నారు. ‘‘ఆనాడు పరిస్థితులను తట్టుకోలేక కార్మికులు సమ్మె చేసినప్పుడు, అప్పటి పాలకులు ఎంత కఠినంగా ప్రవర్తించారో మీరందరూ చూశారు. గత పాలకుల మాదిరిగా మేం వ్యవహరించబోమని స్పష్టం చేస్తున్నా” అని అన్నారు.
బడ్జెట్ సమావేశాలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా బిల్లులాంటి వాటితోపాటు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి, తాను, ఇతర మంత్రులు బిజీగా ఉన్న సమయంలో.. అకస్మాత్తుగా సమ్మె నిర్ణయం తీసుకోవడం వల్ల ఒక కార్మికుని కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఇది అత్యంత బాధాకరమని, ఆ కుటుంబానికి ఇది తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఆర్టీసీకి సంబంధించిన పాలనాపరమైన, విధానపరమైన నిర్ణయాలపై ఖచ్చితంగా చర్చిద్దాం.. కార్మికుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించుకుందాం’’ అని భట్టి విజ్ఞప్తి చేశారు.

