డ్యూటీలో చేరుతున్న కార్మికులు.. డిపోల వద్ద సందడి

డ్యూటీలో చేరుతున్న కార్మికులు.. డిపోల వద్ద సందడి

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు. చనిపోయిన కార్మికులకు నివాళి అర్పించి డ్యూటీలో జాయిన్ అవుతున్నారు. 55 రోజుల తర్వాత విధుల్లోకి చేరడంతో డిపోల దగ్గర సందడి వాతావరణం ఏర్పడింది. కార్మికులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ… స్వీట్లు పంచుకుంటున్నారు. షరతులు లేకుండా డ్యూటీలోకి తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

డిపోల్లోకి ఎంటరయ్యే సమయంలో ఉధ్వేగానికి లోనయ్యారు. కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేకంగా పూజలు చేసి బస్సులు బయటకు తీశారు. తిరిగి సొంత ఇంటికి చేరినంత సంతోషంగా ఉందని కార్మికులు చెబుతున్నారు.

కార్మికుల విధుల్లో చేరడంతో ఆర్టీసీ బస్సులు యధావిధిగా నడుస్తున్నాయి. సమ్మెలో ఎవరూ గెలవలేదు, ఎవరూ ఓడిపోలేదన్నారు కార్మికులు.  సంస్థను బతికించుకోవడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రైవేటీకరణ అశం శాశ్వతంగా మర్చిపోయి… తమ డిమాండ్లపై పునరాలోచించాలని కోరారు.

హైదరాబాద్ బోడుప్పల్ ఆర్టీసీ డిపో దగ్గర సందడి వాతావరణం నెలకొంది. సుదీర్ఘ సమ్మె తర్వాత కార్మికులు విధుల్లో చేరారు. మళ్లీ డ్యూటీలోకి తీసుకోవడంతో సీఎం కేసీఆర్ కు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. మిగితా డిమాండ్లు కూడా తీర్చాలని కోరారు.