హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లుగా జూన్ 2వ తేదీన అధికారికంగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆర్టీసీ జేఏసీ కోరింది. సోమవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మె విరమణ సమయంలో ప్రభుత్వం అంగీకరించిన 32 డిమాండ్లను ఏమాత్రం జాప్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. అలాగే, అమరుడైన శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు మే నెల జీతంలో ప్రతి కార్మికుడి నుంచి రూ. 300 కోత విధించి అందజేయాలన్న జేఏసీ ప్రతిపాదనకు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సానుకూలంగా స్పందించారు. దీనికి నేతలు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.
