ఎక్కడికక్కడ అరెస్టులు

ఎక్కడికక్కడ అరెస్టులు
  • ఆర్టీసీ కార్మికుల ‘చలో ట్యాంక్‌‌ బండ్‌‌’ నేడే

హైదరాబాద్‌‌, వెలుగుఆర్టీసీ జేఏసీ శనివారం నిర్వహించాలని నిర్ణయించిన ‘చలో ట్యాంక్‌‌బండ్‌‌’పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జేఏసీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. గురువారం అర్ధరాత్రి నుంచే నేతలను అదుపులోకి తీసుకున్నారు. ట్యాంక్​బండ్​వద్ద ఆంక్షలు విధించారు. హైదరాబాద్ చుట్టూ చెక్​పోస్టులు ఏర్పా టు చేశారు. ప్రగతిభవన్, బీఆర్కే భవన్ చుట్టుపక్కల భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మరోవైపు ఆర్టీసీ జేఏసీ మాత్రం.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా చలో ట్యాంక్​బండ్ నిర్వహించి తీరుతామని స్పష్టం చేసింది.

ఫోన్లు స్విచ్ఛాఫ్‌‌ చేసి అజ్ఞాతంలోకి

కీలక నాయకులు, ముందుండి నడిపే లీడర్లను పోలీ సులు అరెస్ట్‌‌ చేశారు. జేఏసీ నేతలతో పాటు వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష పార్టీల నేతలపై నిఘా పెట్టారు. సిగ్నల్‌‌ ద్వారా పోలీసులు ట్రేస్‌‌ చేసే అవకాశం ఉండటంతో కొందరు లీడర్లు ఫోన్లు స్విచ్ఛాఫ్‌‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక శుక్రవారం హైదరాబాద్‌‌లో ఆర్టీసీ జేఏసీ కో -కన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఏ కారణంగా తనను అరెస్టు చేస్తున్నారో చెప్పాలని రాజిరెడ్డి ప్రశ్నించారు. ‘ఆర్టీసీ పరిరక్షణ కోసం చావడానికైనా సిద్ధం.. చంపండి’ అంటూ నినాదాలు చేశారు. లా అండ్ ఆర్డర్ కి విఘాతం కలిగే ప్రమాదం ఉండడంవల్లే  ఆర్టీసీ జేఏసీ కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వడం లేదని పోలీసులు చెప్పారు. ఇప్పటికే ట్యాంక్‌‌ బండ్‌‌ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. భారీగా పోలీసులను మోహరించారు. గురువారం అర్ధరాత్రి నుంచే ట్యాంక్ బండ్, సెక్రటేరియట్, ప్రగతిభవన్ పరిసర ప్రాంతాలను అధీనంలోకి తీసుకున్నారు. పక్కనే బీఆర్కే భవన్‌‌ ఉండటంతో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.

సిటీ చుట్టూ చెక్ పోస్టులు

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని జాతీయ రహదారులు, జిల్లాలను కలిపే ప్రధాన రోడ్లలో పోలీసులు చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన బస్సులను ఎస్కార్ట్​తో సిటీ దాటించే ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోని హోటల్స్, లాడ్జీలపై నిఘా పెట్టారు. ట్యాంక్ బండ్ కు చేరుకునే అన్ని రూట్లలో బారికేడ్స్, ముళ్లకంచెలు ఏర్పాటు చేస్తున్నారు. సిటీలో సమస్యాత్మక ప్రాంతాల్లో తిరిగే బస్సులతో పాటు ట్యాంక్ బండ్, లక్డీకపూల్, సెక్రటేరియట్, రాణిగంజ్, బేగంపేట్ రూట్లలో వెళ్లే బస్సులకు రక్షణ కల్పించేందుకు పెట్రోలింగ్ నిర్వహించనున్నారు.

అనుమానాస్పద వ్యక్తులపై స్పెషల్ ఫోకస్

మిలియన్ మార్చ్ తరహాలో జన సమీకరణ చేస్తున్నారన్న ఐబీ సమాచారంతో  అనుమానస్పద వ్యక్తులపై పోలీసులు నిఘా పెట్టారు. పలు ఏరియాల్లో కేంద్ర బలగాలను మోహరించారు.

సక్సెస్ చేయాలె..

శుక్రవారం హైదరాబాద్‌‌లో అన్ని పార్టీల నేతలు సమావేశమయ్యారు. చలో ట్యాంక్‌‌ బండ్‌‌ కార్యక్రమాలన్ని ఎలా విజయవంతం చేయాలనే దానిపై చర్చించారు. జిల్లాల నుంచి కార్మికులను రప్పించడం, పార్టీల శ్రేణుల తరలింపు తదితర అంశాలపైనా చర్చించారు. సీపీని కలిసిన అఖిలపక్ష నేతలుకోదండరాం, ఎల్.రమణ, తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డి, నారాయణ నేతృత్వంలోని అఖిలపక్ష నేతలు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ను శుక్రవారం మధ్యాహ్నం కలిశారు. చలో ట్యాంక్​బండ్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని, ముందస్తు అరెస్ట్ లను నిలిపివేయాలని కోరారు. దీక్షలకు ఎలాంటి అనుమతులు లేనందున ఎవరైనా ట్యాంక్ బండ్ పై వస్తే అదుపులోకి తీసుకుంటున్నామని సీపీ స్పష్టం చేశారు. తర్వాత టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ, ప్రజారవాణాకు ఎలాంటి ఆటంకం కలగకుండా శాంతియుతంగానే చలో ట్యాంక్​బండ్​ను నిర్వహిస్తామని తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొంటామన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ సమ్మె విషయంపై అఖిలపక్షాన్ని ప్రభుత్వం పిలవకపోవడం బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. చలో ట్యాంక్​బండ్​కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చట్టాన్ని విస్మరించి ఆర్టీసీని ఎలా ప్రైవేటీకరిస్తారని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. చలో ట్యాంక్​బండ్​కు అనుమతిని అడిగినా.. ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం ఏంటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి ప్రశ్నించారు.

ఆటో డ్రైవర్స్ జేఏసీ మద్దతు

చలో ట్యాంక్‌‌ బండ్‌‌ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ తెలిపింది. ట్యాంక్‌‌ బండ్‌‌కు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లందరూ తరలిరావాలని జేఏసీ కన్వీనర్ మహమ్మద్ అమనుల్లాఖాన్ పిలుపునిచ్చారు.

అడుగడుగునా ఆంక్షలు

వెలుగు, నెట్​వర్క్​:  ‘చలో ట్యాంక్​బండ్’కు పోలీసు లు అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. జిల్లాల్లో ఆర్టీసీ జేఏసీ, విపక్ష నేతలను ముందస్తుగా అరెస్ట్​ చేశారు. మహబూబ్​నగర్​లోని దీక్షా శిబిరంపై విరుచుకుపడి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ​ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేస్తున్న మహిళా కార్మికులను సైతం అదుపులోకి తీసుకున్నారు. నాగర్​కర్నూల్​లోని గాంధీపార్కులో దీక్ష చేస్తున్న జేఏసీ నేతలను, నారాయణపేట జిల్లాలో కార్మికులను అరెస్ట్​ చేశారు. వనపర్తి జిల్లాలో బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్​లోని సమ్మె చేస్తున్న కార్మికులను అరెస్టుచేసి వివిధ స్టేషన్లకు తరలించారు.  మెదక్​ జిల్లాలో 22 మందిని, సంగారెడ్డి, జహీరాబాద్​లో పలువురిని అరెస్ట్ చేశారు. సిద్దిపేటలో కాంగ్రెస్, సీపీఐ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో  సీపీఐ, బీజేపీలకు చెందిన ముఖ్య నేతలందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 230  మంది కార్మికులను, బోధన్​లో భోజనం చేస్తున్న మహిళా కండక్టర్ల చేతిలోని గిన్నెలు లాగేసి మరీ తీసుకెళ్లారు. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్​ జిల్లాల్లో  ఉదయంనుంచే అరెస్టుల పర్వం కొనసాగింది.
పరకాలలో ధర్నా నిర్వహిస్తున్న అఖిలపక్ష నాయకులతో పాటు సుమారు 60మంది కార్మికులను పోలీసులు అరెస్టుచేశారు. మహబూబాబాద్, తొర్రూరులో కార్మికులను అదుపులోకి తీసుకున్నారు.