రైట్..రైట్ : ఆర్టీసీ ప్రైవేట్ రూటు

రైట్..రైట్ : ఆర్టీసీ ప్రైవేట్ రూటు

20% పూర్తిగా బయటి బస్సులే
30 శాతానికి పెరగనున్న కిరాయి బస్సులు

48వేల మంది సెల్ఫ్​ డిస్మిస్​ అయ్యారు: సీఎం కేసీఆర్​
ఇక సంస్థలో యూనియన్లు ఉండవ్
ప్రైవేటు బస్సుల్లోనూ ఆర్టీసీ చార్జీలే
కమిటీ అనుమతిస్తేనే టికెట్ల రేట్లు పెంపు
డిపోల ముందు లొల్లిపెడితే కఠిన చర్యలే
సంస్థను పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం లేదు
అద్దె బస్సులతో కొత్త బస్సులొచ్చినట్లేనని వ్యాఖ్య
ఆర్టీసీపై సీఎంకు సునీల్​ శర్మ కమిటీ రిపోర్టు

హైదరాబాద్, వెలుగు:ఆర్టీసీలో  ప్రైవేటుకు రాష్ట్ర ప్రభుత్వం రూట్​ వేసింది. 20 శాతం పూర్తిగా ప్రైవేటు బస్సులను దింపాలని నిర్ణయించింది. అదేవిధంగా ఇప్పటికే సంస్థలో 21 శాతం ఉన్న అద్దెబస్సులను 30 శాతానికి చేర్చాలని విధాన నిర్ణయం తీసుకుంది. ఇక ముందు ఆర్టీసీలో యూనియన్లు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ కమిటీ ఆర్టీసీకి సంబంధించిన ప్రతిపాదనలను సోమవారం సీఎం కేసీఆర్​కు అందజేసింది. వీటిపై ప్రగతి భవన్​లో ఆయన సమీక్షించారు. ప్రభుత్వం, యాజమాన్యం దృష్టిలో ఆర్టీసీ సిబ్బంది 1200 మాత్రమేనని, మిగతావారు(48వేలకు పైగా సిబ్బంది) గడువులోపల డ్యూటీలో చేరకపోవడంతో  ‘సెల్ఫ్ డిస్మిస్’ అయినట్లే అని కేసీఆర్​ స్పష్టం చేశారు. వాళ్లందరినీ ఆర్టీసీ సిబ్బందిగా పరిగణించనప్పుడు ఇక యూనియన్ల ప్రసక్తే  లేదని, యూనియన్లు వాటి అస్తిత్వాన్ని కోల్పోయాయని అన్నారు. యూనియన్లది దురహంకారమని, అతిగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. డ్యూటీలో నుంచి తొలిగిపోయినవారు డిపోల వద్ద, బస్టాండ్ల వద్ద లొల్లి పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆయన ఆదేశించారు.

ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టం లేదని, ఆర్టీసీ సంస్థ ఉండి తీరాల్సిందేనని సీఎం అన్నారు.  మొత్తం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం వివేకమైన చర్య కాదని తెలిపారు. సంస్థను లాభాల బాటలో నడిపించడానికి చర్యలు తీసుకుంటున్నామని, తమ చర్యలను ప్రజలు ప్రశంసిస్తున్నారని చెప్పారు. ‘‘ప్రస్తుతం ఆర్టీసీలో 10,400 బస్సులున్నాయి. వీటిని భవిష్యత్ లో మూడు రకాలుగా విభజించి నడపాలి. 50 శాతం బస్సులు అంటే 5200 పూర్తిగా ఆర్టీసీకి చెందినవై.. ఆర్టీసీ యాజమాన్యంలోనే ఉంటాయి. 30 శాతం బస్సులు.. అంటే 3100 బస్సులు అద్దె రూపంలో తీసుకుని వాటిని కూడా పూర్తిగా ఆర్టీసీ పర్యవేక్షణలోనే, ఆర్టీసీ పాలన కిందే నడుపుతాం. వాటిని ఉంచడం కూడా ఆర్టీసీ డిపోల్లోనే. మరో 20శాతం బస్సులు అంటే 2100 బస్సులు పూర్తిగా ప్రైవేటువి. వాటికి ప్రైవేట్ స్టేజ్ కారేజ్ గా అనుమతి ఇస్తాం. ఈ బస్సులు పల్లె వెలుగు సర్వీసు కూడా నడపాలి” అని తెలిపారు. ఆర్టీసీ చార్జీలు, ప్రైవేట్ బస్సుల చార్జీలు సమానంగా ఉంటాయని, అవన్నీ ఆర్టీసీ నియంత్రణలోనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రైవేటు బస్సుల చార్జీలను కూడా ఆర్టీసీ బస్సుల చార్జీలను పెంచినప్పుడే పెంచుతామన్నారు.  స్వల్పంగా పెంచడానికి కూడా ఆర్టీసీ కమిటీ నిర్ణయం మేరకు అది కూడా అవసరం అని భావించినప్పుడే చేస్తామని తెలిపారు.  ఇప్పటికే 21శాతం  అద్దె బస్సులను ఆర్టీసీ నడుపుతున్నదని, అంటే, ఇక అద్దెకు తీసుకోవాల్సింది అదనంగా మరో 9శాతం మాత్రమేనని చెప్పారు. అదనంగా 9 శాతం అద్దె బస్సులను పెంచడం అంటే ఆర్టీసీకి కొత్త బస్సులు వచ్చినట్లేనని సీఎం అన్నారు.

గొడవ చేస్తే కఠిన చర్యలు

ఆర్టీసీ యూనియన్లపై సీఎం కేసీఆర్  తీవ్రంగా స్పందించారు. దురహంకారపూరితంగా యూనియన్లు సమ్మెకు వెళ్లాయని, అది మోనోపలి భావనే అని అన్నారు. ఇష్టం వచ్చిన రీతిలో సమ్మె చేస్తామనటం అతిప్రవర్తనేనని మండిపడ్డారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏ సంస్థలో ఏం జరిగినా ప్రభుత్వ అనుమతితోనే జరగాలని సీఎం తేల్చిచెప్పారు. ‘‘ప్రభుత్వ, ఆర్టీసీ యాజమాన్య విజ్ఞప్తికి యూనియన్లు స్పందించలేదు. తొలగిపోయినవారు డిపోల దగ్గర కానీ, బస్ స్టేషన్ల దగ్గర కానీ గొడవ చేయకుండా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయమని డీజీపీని ఆదేశించాను. విధుల్లో వున్న 1200 మంది తప్ప ఎవరు వచ్చి దురుసుగా ప్రవర్తించినా, సరైన చర్యలు డీజీపీ తీసుకుంటారు” అని హెచ్చరించారు.  ‘‘సమ్మెకు ప్రధాన కారణం ఆర్టీసీ యూనియన్ల అతిప్రవర్తనే. వాళ్లు ఎక్కిన చెట్టు కొమ్మను వాళ్లే నరుక్కున్నారు. గత 40ఏండ్లుగా జరుగుతున్న దాష్టీకం వల్ల ఇదంతా చేయాల్సి వచ్చింది. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో సమ్మె చేసిన ఆర్టీసీ యూనియన్లు, టీఆర్ ఎస్  ప్రభుత్వంలో కూడా సమ్మెకు దిగాయి. ప్రభుత్వం ఏది ఉన్నా వీళ్ల అతిప్రవర్తనలో మార్పు లేదు. పకడ్బందీ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ యూనియన్లు యాజమాన్యానికి ఇవ్వడం లేదు. సమ్మె ఉధృతం చేస్తామనడం హాస్యాస్పదం’’ అని సీఎం అన్నారు.

సబ్సిడీ బస్సుపాసులు ఆర్టీసీ నియంత్రణలోనే

ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకనుగుణంగానే ఆర్టీసీని పటిష్టపరచడానికి అనేక చర్యలు చేపట్టుతున్నామని సీఎం కేసీఆర్  తెలిపారు. “సబ్సిడీ బస్ పాసులు ఇక ముందు కూడా కొనసాగుతాయి. ఇవన్నీ ఆర్టీసీ నియంత్రణలోనే ఉంటాయి. సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. దానికి కావాల్సిన నిధులు బడ్జెట్​లో కేటాయిస్తాం” అని చెప్పారు.  ఆర్టీసీ  ఒక అద్భుతమైన సంస్థగా రూపుదిద్దుకోవాలని, భవిష్యత్తులో లాభాల్లోకి  వచ్చి  కార్మికులకు (కొత్తగా చేరేవారికి) బోనస్ ఇచ్చే స్థాయికి  ఎదగాలని అన్నారు. ఆర్టీసీకి కొత్త నెత్తురు, జవసత్వాలు రావాలని సూచించారు. సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషి తదితరులు పాల్గొన్నారు.

ప్రస్తావన లేని డ్రైవర్, కండక్టర్ రిక్రూట్ మెంట్

ఆర్టీసీపై సోమవారం సీఎం కేసీఆర్ చేసిన సమీక్షలో డ్రైవర్, కండక్టర్ల రిక్రూట్ మెంట్​పై ప్రస్తావన రాలేదని తెలుస్తోంది. సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ఈ విషయం లేదు. పూర్తిగా ఔట్ సోర్సింగ్  విధానంలో వీరిని నియమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడువులోగా డ్యూటీకి వచ్చిన 1200 లోపు మందే ఆర్టీసీ సిబ్బందని, మిగతా వారిని (48 వేల మందికిపైగా) ఉద్యోగంలోకి తీసుకునే ప్రసక్తే లేదని, వారి స్థానంలో అతి త్వరలో కొత్తవారిని నియమిస్తామని ఆదివారం జరిగిన సమీక్షలో సీఎం చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. రిక్రూట్​మెంట్​అంశం సోమవారం సమీక్షలో చర్చకు రానట్లు సమాచారం.