బస్సు రిపేర్ చేస్తుండగా గుండెపోటు.. ఆర్టీసీ రాణిగంజ్ డిపో మెకానిక్ మృతి

బస్సు రిపేర్ చేస్తుండగా గుండెపోటు.. ఆర్టీసీ రాణిగంజ్ డిపో మెకానిక్ మృతి

మియాపూర్, వెలుగు:గుండెపోటుతో క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటన హైదరాబాద్ నగరంలో విషాదం నింపింది. బ్రేక్‌డౌన్ అయిన ఆర్టీసీ బస్సును మరమ్మతు చేస్తుండగా ఓ మెకానిక్ ఆకస్మిక గుండెపోటుతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారులోని మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో గురువారం(ఆగస్టు7) ఉదయం చోటుచేసుకుంది.

సికింద్రాబాద్ లాలపేట్ సత్యనగర్‌కు చెందిన పీ. వెంకటేశ్వర్లు (47), రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో మెకానిక్ గా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం రాణిగంజ్ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద బ్రేక్‌డౌన్ కావడంతో మరమ్మతుల కోసం వెంకటేశ్వర్లును పంపించారు.

వెన్కటేశ్వర్లు బస్సును రిపేర్ చేస్తుండగా అకస్మాత్తుగా తనకు నీరసం వచ్చిందని డ్రైవర్ ,కండెక్టర్‌కు చెప్పారు. దీంతో వారు అతన్ని వెంటనే కొండాపూర్ లోని జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు.

వెంకటేశ్వర్లు ఆరోగ్యం బాగానే ఉందని రేపు కూడా పని మీదే బయటకు వెళతానన్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనతో రాణిగంజ్ డిపోలో విషాదఛాయలు అలుముకున్నాయి. సహోద్యోగులు ఆయన మృత్యువును నమ్మలేక పోతున్నారు.

ఈ దుర్ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లుకు తగిన విధంగా సహాయం చేస్తామని, కుటుంబానికి అవసరమైన మద్దతును అందిస్తామని తెలిపారు. మెకానిక్‌గా వెంకటేశ్వర్లుకు 20 ఏళ్ల పైగా ఆర్టీసీలో సేవలందిస్తున్నారు.