- అధిక చార్జీలు వసూలు చేసిన ప్రైవేట్ వాహనదారులు
కరీంనగర్, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో సరిపోను బస్సులు నడవక జనం ఇబ్బందులుపడ్డారు. బస్సులు నడవడం లేదని సమాచారం ముందే ఉండడంతో చాలా మంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లలో పెద్దగా రద్దీ కనిపించలేదు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలోకి దిగారు.
కరీంనగర్ రీజియన్ పరిధిలో 11 డిపోల్లో సుమారు 3 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులుండగా కేవలం 40 మంది డ్రైవర్లు, కండక్టర్లు మాత్రమే విధులకు హాజరయ్యారు. రీజియన్ పరిధిలో వెయ్యి బస్సులు ఉండగా 430కిపైగా బస్సులను ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లతో నడిపించారు. ఇందులో 100 ఎలక్ర్టిక్, 330 హైర్ బస్సులు ఉన్నాయి.
అందరికి ఫ్రీ..
ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో కండక్టర్లు లేకపోవడంతో మహిళలతోపాటు పురుషులను కూడా ఫ్రీగా తీసుకెళ్లారు. టికెట్లు ఇవ్వడం రాక ప్రైవేట్ డ్రైవర్లు వారిని గమ్యస్థానాలకు చేర్చి తిరిగి డిపోలకు చేరుకున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల్లో డ్రైవర్ కం కండక్టర్ ఒక్కరే కావడంతో టికెట్లు ఇచ్చారు.
పోలీసులు, ఆర్టీసీ సిబ్బందికి మధ్య తోపులాట
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో ఓవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండగా, మరోవైపు అధికారులు అద్దె బస్సులను నడిపించారు. సమ్మెలో భాగంగా బుధవారం ఉదయమే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డిపో ఎదుట ఆందోళన చేపట్టి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈక్రమంలో ఏసీపీ ఆర్.ప్రకాశ్ ఓ డ్రైవర్‌ను మెడ పట్టి తోసేయడంతో పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఉదయం హైదరాబాద్ వెళ్లే ప్రైవేట్ వాహనాల్లో ఒక్కొక్కరికి రూ.800 నుంచి రూ.వెయ్యి దాకా వసూలు చేశారు.

