- ఎన్నికలకు మరికొన్ని యూనియన్లు పట్టు
- మే 1న సీఎం రేవంత్‌రెడ్డిని కలవనున్న జేఏసీ నేతలు
- విలీనం ప్రక్రియను ముందుగా ప్రారంభించాలని కోరే చాన్స్
- యూనియన్ నేతల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి: ఎండీ
- అన్ని డిపోల మేనేజర్లకు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: సమ్మె డిమాండ్ల అమల్లో భాగంగా త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమవుతుండగా, యూనియన్లలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. విలీనం వైపే మెజార్టీ యూనియన్ల మొగ్గు చూపుతుండగా, మరికొన్ని యూనియన్లు మాత్రం ముందు గుర్తింపు సంఘం ఎన్నికలకే పట్టుపట్టాలని భావిస్తున్నాయి. విలీనం పూర్తయితే ట్రేడ్‌యూనియన్ల అవసరమే లేదన్నది మొదటిపక్షం వాదనకాగా.. విలీన ప్రక్రియ కమిటీ పరిశీలనలో ఉందని, ఇది ఎంత కాలం పడ్తుందో తెలియదని, గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగితే విలీనం విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగించవచ్చన్నది రెండోపక్షం వాదన. మరోవైపు గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించడం ద్వారా కీలకమైన డిమాండ్‌ను నెరవేర్చినట్టు అవుతుందని అటు ప్రభుత్వం, ఇటు యాజమాన్యం భావిస్తున్నది.
- ఒకటిన సీఎంతో భేటీ
ఆర్టీసీ జేఏసీ నేతలు మే 1 న సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ డిమాండ్లన్నింటికీ ప్రభుత్వం అంగీకరించడంతో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ఈ సందర్భంగా ఈ అంశంపైనే సీఎం వద్ద ప్రధానంగా ప్రస్తావించేందుకు యూనియన్ నేతలు సిద్ధమవుతున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు జరిపించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నదని, కానీ విలీన ప్రక్రియను ప్రారంభిస్తే యూనియన్ ఎన్నికలు అవసరం లేదని చెప్పాలని భావిస్తున్నారు. కాగా, విలీన ప్రక్రియ ఆర్థికపరమైన అంశాలతో ముడిపడినది కావడం, కమిటీ పరిశీలనలో ఉండడంతో ఆ నివేదిక వచ్చే దాకా దీనిపై సర్కారు ముందుకెళ్లే అవకాశం లేదనే వాదన వినిపిస్తున్నది. అందువల్ల యూనియన్ ఎన్నికలకు వెళ్లాలనేది జేఏసీలోని మరో వర్గం వాదన. దీనిపై సీఎం ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
- వెంటనే స్పందించండి: ఎండీ నాగిరెడ్డి
ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై యూనియన్ నేతలెవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి బుధవారం ఆయా డిపోల మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో యూనియన్ నేతల విషయంలో వ్యవహరించినట్టు ఇప్పుడు వ్యవహరించొద్దని, వారు చేసే ఫిర్యాదులు, ఇతర అంశాలపై అధికారులు వెంటనే స్పందించాలన్నారు. యూనియన్ నేతలు ఏ విషయాలపై అధికారులను కలిసినా వారికి తగిన గౌరవం ఇచ్చి, వారు చెప్పే సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

