హైకోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని ఇన్నాళ్లూ ఆశలు
ఇప్పుడు ఎటూ తేలకపోవడంతో ఆందోళన
హైదరాబాద్, వెలుగు: ఇన్నాళ్లూ హైకోర్టునే నమ్ముకున్న ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు. కోర్టు తాజా ఉత్తర్వులతో వారు నిరాశకు గురవుతున్నారు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు, బెదిరింపులు చేసినా లెక్కచేయకుండా.. హైకోర్టు తీర్పు కోసం ఆశగా ఎదురుచూశారు. సమ్మె మొదలైనప్పటి నుంచి ఈ అంశంపై విచారణ జరిగిన ప్రతిసారి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు తమకు అనుకూలంగా ఉండటంతో కార్మికుల్లో మరింత ఉత్సాహం, నమ్మకం పెరిగింది. అక్టోబర్ 5న ఆర్టీసీ సమ్మె ప్రారంభమవగా అదే రోజు ఓయూ రీసెర్చ్ స్కాలర్ సుబేందర్ సింగ్ అత్యవసర హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. సమ్మె విరమణకు ఉత్తర్వులివ్వాలని అందులో కోరారు. ఆర్టీసీ సమ్మెపై మొదట దాఖలైన పిటిషన్ ఇదే. ఆ తర్వాత జీతాల చెల్లింపు, ఆర్టీసీ రూట్లు ప్రైవేట్ పరం వంటి అంశాలపై పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ మేనేజ్మెంట్, జీహెచ్‌ఎంసీ కౌంటర్లు దాఖలు చేశాయి.
విచారణ జరిగిన ప్రతిసారి ప్రభుత్వానికి, ఆర్టీసీకి హైకోర్టు మొట్టికాయలు వేసింది. కొన్ని సందర్భాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కోర్టులకే తప్పుడు నివేదికలు ఇస్తారా?’ అని మండిపడింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ కోర్టులో సారీ కూడా చెప్పిన సంఘటనలు ఉన్నాయి. విచారణ వాయిదాలు పడుతూ వచ్చినప్పటికీ.. కోర్టు కామెంట్స్ కార్మికులకు ఊరటనిచ్చాయి. డెడ్‌లైన్ లోపు డ్యూటీలో చేరకపోతే కొలువులు పోయినట్లేనని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించినా.. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న నమ్మకంతో కార్మికులు ధైర్యంగా ఉన్నారు. అయితే తాజాగా హైకోర్టులో ఈ అంశంపై ఎటూ తేలకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు. అయినా సమ్మెలో ముందుకు సాగుతామని, ఆర్టీసీ రక్షణ కోసం ఉద్యమిస్తామని చెబుతున్నారు.

