డ్రైవర్లు, కండక్టర్లతో కార్గోపై ప్రచారం

డ్రైవర్లు, కండక్టర్లతో కార్గోపై ప్రచారం

హైదరాబాద్, వెలుగు: బస్సులు, రూట్ల సంఖ్య తగ్గించడంతో మిగిలిపోయిన డ్రైవర్లు, కండక్టర్లను కార్గో, పార్సిల్ సర్వీసుల ప్రచారానికి వాడుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. వారంతా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని అధికారులు ఆదేశాలిస్తున్నారు. కరోనా టైమ్​లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఏంటని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.

క్యాంపెయినింగ్ చేయాల్సిందే..

అదనపు ఆదాయం కోసం ఇటీవల కార్గో, పార్సిల్ సర్వీసులను ఆర్టీసీ ప్రారంభించింది. దీని ద్వారా ఏటా రూ. 200 కోట్ల వరకు ఇన్ కమ్ రాబట్టాలని టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం 140 బస్టాండ్లలో సర్వీసులు నడుస్తున్నాయి. లాక్​డౌన్​తర్వాత సిటీ, ఇంటర్ స్టేట్ బస్సులు మినహా రాష్ట్రమంతా బస్సులు నడపాలని నిర్ణయించారు. ఇందుకోసం 6,200 బస్సులను రెడీ చేసినా, ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో 4,500 బస్సులు కూడా తిరగడం లేదు. దీంతో అనేక మంది డ్రైవర్లు, కండక్టర్లకు పని లేదు. అయితే వారిని కార్గో, పార్సిల్ సర్వీసుల క్యాంపెయినింగ్ కు వాడుకోవాలని భావిస్తున్నారు. ఇదే విషయమై బుధవారం హైదరాబాద్ లోని పరిధిలోని చంగిచెర్ల, కుషాయిగూడ డిపోల సిబ్బందితో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. కార్గో, పార్సిల్ సర్వీసులకు సంబంధించి ప్రచారం చేయాల్సిందేనని ఆదేశించారు. ఇట్లనేఅన్ని డిపోల్లో నిర్వహించనున్నట్లు తెలిసింది.

కరోనా టైంల డోర్ టు డోర్ ఎట్ల పోతం?

క్యాంపెయినింగ్​లో భాగంగా 15 మందిని కలిపి ఒక టీమ్​గా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టీమ్​కు ఒక్కో ఏరియా అప్పజెప్పుతామని, ఆ టార్గెట్ ను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ఎక్కడికి వెళ్లింది, ఎవరిని కలిసింది.. తదితర వివరాలను, ఫోన్ నంబర్లను సాయంత్రం ఇంటికెళ్లేటప్పుడు సంబంధిత అధికారికి ఇవ్వాలని సూచించారు. ఈ పనులు చేయకుంటే ఆబ్సెంట్ వేస్తామంటున్నారని సిబ్బంది చెబుతున్నారు. ఈ క్యాంపెయినింగ్​ను డ్రైవర్లు, కండక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. కరోనా టెన్షన్​లో ఇళ్లిళ్లు ఎలా తిరుగుతామంటున్నారు. ఇదిలాఉంటే 50 శాతం సిబ్బందితో రొటేషన్ పద్ధతిలో పనిచేయించాలని సర్కారు ఆదేశించినా ఆర్టీసీలో అది అమలు కావడం లేదు.