పారిస్: పారాలింపిక్స్‌లో ఇండియాకు ఐదో పతకం లభించింది. మొన్న ఒలింపిక్స్‌లో ఇండియా షూటర్లు అదరగొట్టిన వేదికపై ఇప్పుడు పారా షూటర్లూ సత్తా చాటుతున్నారు. పోటీల రెండో రోజు షూటర్లు మూడు మెడల్స్ అందుకోగా.. మూడో రోజు షూటింగ్ నుంచి మరో పతకం వచ్చింది. ఎస్‌హెచ్1 విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ఈవెంట్‌లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకం గెలిచింది. దాంతో పారాలింపిక్స్ పిస్టల్ విభాగంలో ఇండియాకు పతకం అందించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.
శనివారం జరిగిన ఫైనల్లో ఫ్రాన్సిస్211.1 స్కోరుతో మూడో స్థానం సాధించింది. ఇరాన్ షూటర్ సారెహ్‌జవాన్మర్డి 236.8 స్కోరుతో గోల్డ్ నెగ్గగా, టర్కీకి చెందిన ఐసెల్ ఒజ్గాన్ 231.1 స్కోరుతో సిల్వర్ ఖాతాలో వేసుకుంది. అయితే, ఎస్‌హెచ్1 (స్టాండింగ్) మెన్స్10 మీటర్ల రైఫిల్‌లో 38 ఏండ్ల వెటరన్ షూటర్ స్వరూప్‌ఉన్హాల్కర్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో స్వరూప్ 613.4 స్కోరుతో 14వ స్థానంతో సరిపెట్టాడు.
వైల్డ్ కార్డుతో వచ్చి..
ఇండియా టీమ్ పారిస్‌కు బయల్దేరే ముందు బైపార్టీ (వైల్డ్‌కార్డ్) ద్వారా అనూహ్యంగా పారాలింపిక్స్‌బెర్తు దక్కించుకున్న 25 ఏండ్ల రుబీనా క్వాలిఫికేషన్‌రౌండ్‌తో పాటు ఫైనల్లోనూ అద్భుత పోరాట పటిమతో మెడల్ అందుకుంది. ఓ దశలో తను ఫైనల్ చేరడం గొప్పే అనిపించింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో తొలి సిరీస్‌పది షాట్స్ తర్వాత 14వ స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత టార్గెట్‌ను గురి చూసి కొట్టిన తను 556 స్కోరుతో ఏడో ప్లేస్‌తో ఫైనల్ చేరింది. టాప్8 షూటర్లు పోటీ పడ్డ తుదిపోరులో ఆమె మెరుగ్గా ఆడింది. పది షాట్ల తొలి సిరీస్ తర్వాత 106.5 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. ఎలిమినేషన్ సిరీస్ మొదలైన తర్వాత కాస్త ఇబ్బంది పడింది.
11-–14 షాట్లలో 8.9, 9.3, 8.7, 9.8 పాయింట్లు మాత్రమే రాబట్టి నాలుగో స్థానానికి పడిపోయింది. కానీ, తర్వాతి రెండు షాట్లలో 9.7, 10.4 పాయింట్లతో తిరిగి టాప్-–3లోకి వచ్చింది. 19, 20వ షాట్లలో ఒజ్గాన్ 8.2, 8.9 పాయింట్లు మాత్రమే రాబట్టగా.. రుబీనా 9.5, 9.8 పాయింట్లతో మొత్తంగా 211.1 స్కోరుతో రెండో ప్లేస్‌కు దూసుకొచ్చి సిల్వర్‌పై ఆశలు రేపింది. కానీ, తర్వాతి రెండు షాట్లలో 9.2, 8.9 పాయింట్లు మాత్రమే చేసిన ఇండియా షూటర్ మూడో స్థానంతో పోరు ముగించింది.
సెమీస్‌లో నితేశ్, సుకాంత్
షట్లర్లు నితేశ్ కుమార్, సుకాంత్ కడమ్‌సెమీస్ చేరుకున్నారు. మెన్స్ సింగిల్స్ ఎస్‌ఎల్3 కేటగిరీ గ్రూప్–ఎ మ్యాచ్‌లో నితేశ్ 21–13, 21–14తో బున్సున్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. గ్రూప్‌లో టాప్ ప్లేస్‌తో నితేశ్ సెమీస్‌లో అడుగుపెట్టాడు. ఎస్‌ఎల్4 గ్రూప్–బి మ్యాచ్‌లో సుకాంత్ 21–12, 21–12తో సిరపాంగ్ (థాయ్‌లాండ్)పై నెగ్గి ముందంజ వేశాడు. సెమీస్‌లో అతను సుహాస్ య తిరాజ్‌తో తలపడనున్న నేపథ్యంలో ఇండియాకు పతకం ఖాయమైంది. మరోవైపు మన్‌దీప్ కౌర్ విమెన్స్ ఎస్‌ఎల్3 కేటగిరీ గ్రూప్–బి చివరి మ్యాచ్‌లో మన్‌ప్రీత్ కౌర్ 21–23, 21–10, 21–17తో వినోట్ (ఆస్ట్రేలియా)పై గెలిచి క్వార్టర్స్ చేరింది.
అర్షద్, జ్యోతికి నిరాశ
స్లైక్లింగ్ ఈవెంట్లలో ఇండియా సైక్లిస్ట్‌లు అర్షద్ షేక్, జ్యోతి గదేరియా క్వాలిఫికేషన్ రౌండ్లలోనే ఇంటిదారి పట్టి నిరాశపరిచారు. మెన్స్1000 మీటర్ల టైమ్ ట్రయల్ సి1–3 ఈవెంట్‌లో అర్షద్ (1:21.416 సె) చివరి, 17వ స్థానంతో సరిపెట్టాడు. విమెన్స్500 మీటర్ల టైమ్ ట్రయల్ సి1–3 క్వాలిఫికేషన్ రౌండ్‌లో జ్యోతి (49.233సె) 11వ ప్లేస్‌లో నిలిచి ఫైనల్ చేరలేకపోయింది. రోయింగ్‌లో ఏపీకి చెందిన నారాయణ, అనిత మిక్స్‌డ్‌పీఆర్3 డబుల్స్‌స్కల్స్‌రెపిఛేజ్‌లో నిరాశపరిచి పతక రౌండ్‌కు అర్హత సాధించలేకపోయారు.
ఆర్చర్లు ఇంటిదారి
ఆర్చరీలో ఇండియాకు ప్రతికూల ఫలితాలే వచ్చాయి. రెండు చేతులు లేకుండా ఆర్చరీ ఆడుతున్న తొలి పారా ఆర్చర్‌శీతల్ దేవి ఒక్క పాయింట్ తేడాతో ప్రిక్వార్టర్స్‌లో ఓడగా.. సరితా కుమారి క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది. వరల్డ్ నం.2 శీతల్ విమెన్స్ ఆర్చరీ కాంపౌండ్ ప్రిక్వార్టర్స్‌లో 137–138తో చిలీకి చెందిన జునిగా చేతిలో ఓడింది. క్వార్టర్స్‌లో సరిత 140–145తో టర్కీ ఆర్చర్ గిర్డి ఒంజుర్ చేతిలో చిత్తయింది.