
కెరీర్ ప్రారంభంలో సింగర్ గా ఎంట్రీ ఇచ్చి.. ‘యమదొంగ’ మూవీతో హిట్ సాధించిన ‘మమత మోహన్ దాస్’ కొన్నాళ్లు టాలీవుడ్ కు దూరమైంది. లేటెస్ట్ గా ‘రుద్రంగి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె పోషిస్తున్న ‘జ్వాలాబాయి’ పాత్రను ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు. భయమెరుగని ధీరవనితగా కనిపిస్తున్న ఆమె పోస్టర్ ఆకట్టుకుంటోంది. ‘మమతా మోహన్ దాస్’ చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ‘నువ్వు దొర అయితే నేను దొరసానిని.. తగలబెడతా చల్ హట్’ అంటూ ఆమె చెప్పిన డైలాగ్స్ మాస్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ మోషన్ పోస్టర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. ఈ చిత్రంలో 'భీమ్ రావ్ దొర' గా జగపతి బాబు కనిపించనున్నారు.
ఈ చిత్రం నుంచి జగపతి లుక్, ప్రీ- అనౌన్స్మెంట్ పోస్టర్ లకు మంచి స్పందన వచ్చింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో ఇది నిర్మితమౌతోంది. రాజన్న, బాహుబలి, బాహుబలి2, ఆర్. ఆర్.ఆర్, అఖండ. చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, కాలకేయ ప్రభాకర్, సదానందం తదితరులు నటిస్తున్నారు. సంతోష్ శనమోని సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్, నాఫల్ రాజా ఐఏఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో త్వరగా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు.