గూండారాజ్యం ఆమోదయోగ్యం కాదు..లాయర్ పై దాడి కేసులో సుప్రీం ఆగ్రహం 

గూండారాజ్యం ఆమోదయోగ్యం కాదు..లాయర్ పై దాడి కేసులో సుప్రీం ఆగ్రహం 
  • కోర్టులో ఓ లాయర్​పై జ‌రిగిన దాడి కేసులో సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ: తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్‌లో ఇటీవల లాయర్ పై జరిగిన దాడిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. గూండారాజ్యం ఆమోద‌యోగ్యం కాదని వ్యాఖ్యానించింది. కోర్టు ప్రాంగణంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు కొనసాగితే న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నెల 7న తీస్ హ‌జారీ కోర్టులో ఓ కేసుకు సంబంధించి నిందితుడి త‌ర‌పున వాదిస్తున్న లాయ‌ర్‌పై మ‌రో వ‌ర్గానికి చెందిన లాయ‌ర్‌ అత‌ని మ‌నుషులు కోర్టులోనే దాడి చేశారు. 

జ‌డ్జీతోపాటు అందరూ కోర్టులో ఉండగానే పిటిషనర్ తరఫు లాయర్ గుండాలతో కలిసి కోర్టు రూమ్‌లోకి వచ్చాడు. డోర్ లాక్ చేసి, జడ్జి ముందే నిందితుడిని, అతని తరఫున వాదిస్తున్న న్యాయవాదిని ఇష్టమొచ్చినట్లు కొట్టారు. దాంతో దాడికి గురైన న్యాయ‌వాది సుప్రీంకోర్టులో అత్యవ‌స‌ర పిటిష‌న్ దాఖలు చేశారు. దాన్ని సీజేఐ జ‌స్టిస్ సూర్యకాంత్, జ‌స్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన బెంచ్ సోమవారం విచారించింది. 

దాడికి గురైన లాయర్ వాదిస్తూ.. ఫిర్యాదుదారుడి తరఫు న్యాయవాది చాలామంది గూండాలతో కోర్టులోనే, జడ్జి ముందే తనపై దాడి చేశాడని తెలిపాడు. కోర్టు గది తలుపును లోపలి నుంచి లాక్ చేసి మరీ దాడికి దిగారని కోర్టుకు వివరించారు. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ""ఈ రకమైన గూండా రాజ్యం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటివి కొనసాగితే చ‌ట్టం విఫ‌ల‌మైన‌ట్లే. కోర్టుల్లోనే ఇలా ఎలా మిస్‌బిహేవ్ చేస్తారు?" అని తీవ్రంగా మండిపడింది. 

దాడి గురించి ఢిల్లీ హైకోర్టు సీజేకు ఇన్ఫార్మ్ చేశారా అని దాడికి గురైన లాయర్ ను  సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ హైకోర్టు సీజేకు వెంటనే ఒక లేఖ రాసి, ఆ లేఖ‌ కాపీని తమకు కూడా పంపాలని తెలిపింది. ఘటనపై హైకోర్టు చీఫ్ జస్టిస్ స్వయంగా కేసు తీసుకుని అడ్మినిస్ట్రేటివ్ సైడ్‌లో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కేసును తాము ఫాలో అప్ చేస్తామని బాధితుడికి సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది.