కేంద్ర బడ్జెట్ అనగానే మనకు లక్షల కోట్ల గణాంకాలు వినిపిస్తాయి. కానీ సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే.. కేంద్ర ప్రభుత్వం సంపాదించే ప్రతి రూపాయిలో ఎంత భాగం ఎక్కడి నుండి వస్తోంది? దాన్ని దేనికోసం ఎంత ఖర్చు చేస్తోంది? అనే లెక్కలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన లెక్కలు ఇప్పుడు తెలుసుకుందాం...
ముందుగా నిర్మలా సీతారామన్ 2026 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తంగా రూ.53లక్షల 47వేల 315 కోట్ల కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ.35లక్షల 33వేల150 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లలో రూ.18లక్షల 14వేల165 కోట్లుగా ఉండబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. బడ్జెట్ 202627 ప్రకారం పన్నుల ద్వారా రూ.28లక్షల 66వేల 922 కోట్ల ఆదాయం సమకూరుతుందని వెల్లడించారు. రూ.6లక్షల 66వేల 228 కోట్ల పన్నేతర ఆదాయం వస్తుందని తెలిపారు. రుణాల రికవరీ రూ.38వేల 397 కోట్లుగా ఉందన్నారు. ఇతర వసూళ్లు రూ.80వేల కోట్లుగా పేర్కొన్నారు. అప్పులు ఇతర వసూళ్లు రూ.16లక్షల 95వేల 768 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఇలా మొత్తం ఆదాయంరూ.53లక్షల 47వేల 315 కోట్లు ఉండగా దానికి సరిపడా ఖర్చులు కూడా బడ్జెట్ లెక్కల్లో సర్థుబాటు చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
ఆదాయం ఎక్కడి నుంచి ఎంత వస్తోంది?
ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి రూపాయిలో అత్యధిక భాగం అంటే 64 పైసలు పన్నుల ద్వారానే వస్తోంది. ఇందులో ఇన్కమ్ టాక్స్ నుంచి వాటా 21 పైసలు కాగా, కార్పొరేట్ పన్ను 18 పైసలు, జీఎస్‌టీ వసూళ్ల నుంచి మరో 15 పైసలు వస్తున్నాయి. అయితే ఉన్న ఆదాయం సరిపోకపోవడంతో ప్రభుత్వం ప్రతి రూపాయిలో 24 పైసలను అప్పుల ద్వారా కూడబెట్టుకుంటోంది ఖర్చుల కోసం. ఇక చివరిగా ఎక్సైజ్ సుంకం ద్వారా 6 పైసలు, కస్టమ్స్ డ్యూటీ ద్వారా 4 పైసలు ఆదాయం లభిస్తోంది.
మరి ప్రతి రూపాయిలో దేనికి ఎంత ఖర్చవుతోంది..?
తాజా బడ్జెట్ చూస్తే అప్పుల వడ్డీలకే మోడీ ప్రభుత్వం భారీగా చెల్లింపులు చేస్తున్నట్లు తేలిపోయింది. ముందుగా ప్రభుత్వ ఖర్చుల జాబితాను పరిశీలిస్తే.. ఒక ఆందోళనకరమైన విషయం కనిపిస్తుంది. మోడీ ప్రభుత్వం సంపాదించే ప్రతి రూపాయిలో ఏకంగా 20 పైసలు కేవలం అప్పులపై వడ్డీలు చెల్లించడానికే వెళ్లిపోతోంది. ఇక రాష్ట్రాలకు పన్నుల వాటా రూపంలో ఇచ్చేది 22 పైసలు.
ALSO READ : బడ్జెట్ 2026 తర్వాత ఏఏ వస్తువులపై దిగుమతి సుంకం సున్నా అయ్యిందో తెలుసా..?
ఇక ప్రతి రూపాయిలో 42 పైసలు వడ్డీలకు, రాష్ట్రాల వాటా కింద పోతోంటే మిగిలిన డబ్బు ఖర్చు వివరాలను పరిశీలిస్తే.. 17 పైసలు కేంద్ర ప్రభుత్వ పథకాలకే వెళుతోంది. దీని తర్వాత రక్షణ రంగానికి సంపాదించే ప్రతి రూపాయిలో 11 పైసలు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ పథకాలకు 8 పైసలు, సబ్సిడీలకు 6 పైసలు, పెన్షన్లకు 2 పైసలు, ఇతర ఖర్చులకు 7 పైసలు, ఫైనాన్స్ కమిషన్ ట్రాన్సాక్షన్లకు 7 పైసలు ఖర్చు చేస్తోంది మోడీ ప్రభుత్వం.
ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ.. గతంలో చేసిన అప్పులకు చెల్లిస్తున్న వడ్డీలు బడ్జెట్‌లో ఐదవ వంతును హరించివేస్తున్నాయి. అప్పులపై ఆధారపడటం తగ్గించి, ఆదాయ వనరులను పెంచుకోవడం ద్వారానే ఈ వడ్డీల భారం నుండి సెంట్రల్ గవర్నమెంట్ బయటపడగలమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదంతా తిరిగి పన్నుల రూపంలో సామాన్య మధ్యతరగతి ప్రజలపైనే అంతిమంగా భారం పడుతుందని వారు అంటున్నారు.
