బడ్జెట్ 2026 తర్వాత ఏఏ వస్తువులపై దిగుమతి సుంకం సున్నా అయ్యిందో తెలుసా..?

బడ్జెట్ 2026 తర్వాత ఏఏ వస్తువులపై దిగుమతి సుంకం సున్నా అయ్యిందో తెలుసా..?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026లో దిగుమతి సుంకాల విషయంలో కీలక మార్పులు చేశారు. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, ఎగుమతులను పెంచడం, సామాన్యుడికి అవసరమైన మందులను తక్కువ ధరకే అందించడం లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి 2 నుండి అమల్లోకి వచ్చే ఈ కొత్త రేట్ల వల్ల ఏయే వస్తువుల ధరలు ప్రభావితం కానున్నాయో ఇక్కడ చూద్దాం.

తగ్గనున్న వస్తువుల రేట్లు ఇవే: 

1. క్యాన్సర్, అరుదైన వ్యాధుల మందులు: ఆరోగ్య రంగానికి సంబంధించి ఇది పెద్ద ఊరట. 17 రకాల క్యాన్సర్ మందులపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేశారు. అలాగే జాతీయ విధానం కింద గుర్తించిన 7 అరుదైన వ్యాధుల మందులపై కూడా పన్ను సున్నా చేయబడింది. దీనివల్ల ఖరీదైన చికిత్సలు సామాన్యులకు కొంత మేర అందుబాటులోకి వస్తాయి.

2. ఎలక్ట్రానిక్స్: మైక్రోవేవ్ ఓవెన్ల తయారీకి అవసరమైన విడిభాగాలపై సుంకాన్ని సున్నాకు తగ్గించారు. దీనివల్ల దేశీయంగా మైక్రోవేవ్ ఓవెన్ల తయారీ పెరగడంతో పాటు వాటి ధరలు తగ్గే అవకాశం ఉంది.

3. సోలార్ ఎనర్జీ అండ్ బ్యాటరీ స్టోరేజ్: సోలార్ గ్లాస్ తయారీలో వాడే 'సోడియం యాంటిమోనేట్'పై సుంకాన్ని 7.5% నుంచి నిర్మలమ్మ బడ్జెట్లో సున్నాకి తగ్గించారు. అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్(BESS) కోసం వాడే లిథియం-అయాన్ సెల్స్ తయారీ యంత్రాలపై కూడా పన్ను రద్దు చేశారు. ఇది గ్రీన్ ఎనర్జీ రంగానికి పెద్ద బూస్ట్.

4. నూక్లియర్ ఎనర్జీ: అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన అన్ని వస్తువులపై 7.5% ఉన్న సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసింది కేంద్రం. ఇది దేశ ఇంధన భద్రతలో కీలక మార్పుగా మారింది.

5. విమానయానం, రక్షణ: విమానాల తయారీకి వాడే ఇంజన్లు, విడిభాగాలపై సుంకాన్ని రద్దు చేశారు ఆర్థిక మంత్రి. రక్షణ శాఖ పరిధిలోని పబ్లిక్ సెక్టార్ సంస్థలు దిగుమతి చేసుకునే విమాన విడిభాగాలపై కూడా పన్ను ఉండదు.

6. వ్యక్తిగత దిగుమతులు: విదేశాల నుండి వ్యక్తిగత అవసరాల కోసం తెచ్చుకునే వస్తువులపై గరిష్టంగా ఉన్న 20% పన్నును 10 శాతానికి తగ్గించారు.

బడ్జెట్ నిర్ణయంతో పెరిగే వస్తువులు: 

1. రసాయనాలు: పొటాషియం హైడ్రాక్సైడ్‌పై సుంకాన్ని సున్నా నుండి 7.5%కి పెంచారు. ఇది పారిశ్రామిక రసాయనాల ధరలపై ప్రభావం చూపవచ్చు.

2. గొడుగులు: గార్డెన్ అంబ్రెల్లాలు మినహా మిగిలిన గొడుగులపై 20% సుంకం లేదా ఒక గొడుగుకు రూ.60 చొప్పున ఏది ఎక్కువైతే అది వసూలు చేయనున్నారు. అంటే చౌకగా దిగుమతి అయ్యే గొడుగుల ధరలు పెరిగే అవకాశం ఉంది. గొడుగు విడిభాగాలపై కిలోకు రూ.25 చొప్పున అదనపు ఛార్జీ విధించాలని ఆర్థిక మంత్రి నిర్ణయించారు.

ఈ సుంకాల మార్పుల ద్వారా మేక్ ఇన్ ఇండియా పథకాన్ని మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యేకించి నూక్లియర్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ వంటి భవిష్యత్తు ఇంధన వనరులపై పన్నులు తగ్గించడం ద్వారా దేశీయంగా పెట్టుబడులను ఆకర్షించాలని మోడీ సర్కార్ టార్గెట్ గా పెట్టుకుందని చెప్పుకోవచ్చు.