- ముగిసిన రికార్డుల తనిఖీ.. కొనసాగుతున్న
- వడ్ల బస్తాల లెక్కింపు
యాదాద్రి, వెలుగు : సీఎంఆర్ వడ్ల పక్కదారిపై స్టేట్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. యాదాద్రి జిల్లాలో అనుమానం వచ్చిన మిల్లులోని వడ్లను లెక్కిస్తోంది. మంగళవారం పొద్దు పోయినా బస్తాల లెక్కింపు కొనసాగుతూనే ఉంది.
భాగస్వామి మిల్లు సీజ్.. మరో మిల్లుపై ఫోకస్
సీఎంఆర్‌పై సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ సీరియస్‌గా ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల భువనగిరి మండలం అనంతారంలోని యాదాద్రి మిల్లులో రూ. 24 కోట్ల విలువలైన సీఎంఆర్ వడ్లు లేకపోవడంతో కేసు పెట్టడం, ఓనర్‌ను అరెస్ట్ చేశారు. ఈ మిల్లును సీజ్ కూడా చేశారు. ఇదే క్రమంలో యాదాద్రి మిల్లు భాగస్వాములే రామన్నపేట మండలం తుమ్మలగూడెంలో శ్రీ విద్య రైస్ మిల్లు నడిపిస్తున్నారు. ఈ మిల్లులో మంగళవారం నుంచి స్టేట్ టాస్క్‌ఫోర్స్ టీమ్తనిఖీలు చేస్తోంది.
మూడు సీజన్ల సీఎంఆర్ 34,355 టన్నులు
డిఫాల్టర్‌గా తేలి 2012లో మూతపడిన మిల్లును స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ప్రస్తుత యాజమాన్యం కొనుగోలు చేసి, పేరు మార్చి నడిపిస్తోంది. దీంతో శ్రీవిద్య మిల్లుకు ప్రతీ సీజన్లో సీఎంఆర్ వడ్లు కేటాయిస్తునే ఉన్నారు. ఎప్పటికప్పుడు క్లియర్ చేయడంలోజాప్యం చేస్తున్నారు. 2024-–25 యాసంగి సీజన్లో ఈ మిల్లుకు 19,064 టన్నుల వడ్లు ఇవ్వగా, ఇంకా 7070 టన్నుల వడ్లు మిల్లులోనే ఉన్నాయి.
2025–-26 వానాకాలం సీజన్లో 11,312 టన్నులు కేటాయించగా 10,927 టన్నులు, 2025-–26 యాసంగి సీజన్లో 17,422 టన్నులు కేటాయించగా, 16,358 మిల్లులోనే ఉండాల్సి ఉంది. కాగా సీజ్ అయిన యాదాద్రి మిల్లుకు సంబంధించి 2,500 టన్నులు శ్రీ విద్య మిల్లు అప్పగించాల్సి ఉంది. దీంతో మొత్తంగా 36,855 టన్నులు వడ్లు మిల్లులో స్టాక్ ఉండాల్సి ఉంది.
కొనసాగుతున్న లెక్కింపు
మిల్లులో స్టాక్ ఉండాల్సిన స్థాయిలో లేదన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన స్టేట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు మిల్లులోని రికార్డులను స్వాధీనం చేసుకొని పూర్తి స్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం మిల్లు, దాని ఆవరణలోని వడ్ల బస్తాలను లెక్కించడం ప్రారంభించారు. 40 కిలోల బస్తాలే కావడంతో 36,855 టన్నులకు సంబంధించిన లెక్క రావాలంటే 9.21 లక్షల బస్తాలకు పైగా లెక్కించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం పొద్దు పోయినా లెక్కింపు జరుగుతూనే ఉంది. బుధవారం కూడా వడ్ల బస్తాల లెక్కింపు ఉండనున్నట్లు తెలుస్తోంది.
