కేకే పిల్లల ల్యాండ్ రెగ్యులరైజేషన్ వివాదంపై హైకోర్టు సీరియస్

కేకే పిల్లల ల్యాండ్ రెగ్యులరైజేషన్ వివాదంపై హైకోర్టు సీరియస్
  •      ప్రభుత్వ నిర్ణయం ఏంటో మూడు వారాల్లో చెప్పాలని ఆదేశం
  •     నాలుగు వారాల గడువు కోరడాన్ని తప్పుబట్టిన ధర్మాసనం

హైదరాబాద్, వెలుగు: మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు కుమారుడు కె.వెంకటేశ్వరరావు, కుమార్తె, మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్థలాల క్రమబద్ధీకరణ ఉత్తర్వుల వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయం ఏమిటో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచినా, మళ్లీ నాలుగు వారాల గడువు కోరడాన్ని కోర్టు తప్పుబట్టింది. క్రమబద్ధీకరణపై సంబంధిత శాఖతో చర్చించాలని, అవసరమైతే గత డిసెంబర్‌‌లో ఇచ్చిన క్రమబద్ధీకరణ ఉత్తర్వులను సవరించాలంటూ ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై తీసుకున్న చర్యలపై మూడు వారాల్లో అఫిడవిట్‌‌ దాఖలు చేయాలని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం చేపట్టిన చర్యలను కూడా వెల్లడించాలని స్పష్టం చేసింది. 

కేశవరావు కుమారుడు, కుమార్తె స్థలాలను క్రమబద్ధీకరిస్తూ 2023 మే 23న గత బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో 56ను సవాల్‌‌ చేస్తూ సిద్ధిపేట జిల్లా కొండపాకకు చెందిన జి. రఘువీర్‌‌రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై చీఫ్‌‌ జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ జీఎం మొహియుద్దీన్‌‌తో కూడిన బెంచ్‌‌ మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. బంజారాహిల్స్‌‌ స్లమ్‌‌ ఏరియాలో కేశవరావు కుమారుడు వెంకటేశ్వరరావుకు చెందిన 1,161 చదరపు గజాల స్థలాన్ని 1998 నాటి మార్కెట్ విలువ చదరపు గజం రూ.2,500 ప్రకారమే ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. అలాగే, కవితారావు తరఫున విజయలక్ష్మికి చదరపు గజం రూ.350 చొప్పున 425 చదరపు గజాలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జీవో 56 జారీ చేసింది. అప్పట్లోనే ప్రభుత్వ మార్కెట్ ధర చదరపు గజం రూ.60,300 ఉందని పిటిషనర్ తెలిపారు. గత విచారణ సందర్భంగా మురికివాడలో స్థలం క్రమబద్ధీకరణకు కొన్ని పరిమితులు ఉంటాయని, ఈ కేసుకు సంబంధించి ఆ నిబంధనలు పాటించలేదని కోర్టు పేర్కొంది. 

జీవో జారీ చేసిన తర్వాత నాటి మార్కెట్ ధరను కాకుండా 1998 నాటి దరఖాస్తు తేదీ నాటి ధరను పరిగణనలోకి తీసుకోవడం సరికాదని, అధికారుల నిర్ణయంలో పొరపాటు జరిగి ఉండవచ్చని తెలిపింది. ఈ వ్యవహారంపై బెంచ్ మంగళవారం మరోసారి విచారణ చేపట్టగా.. అడిషనల్ అడ్వకేట్‌‌ జనరల్‌‌ (ఏఏజీ) మహమ్మద్‌‌ ఇమ్రాన్‌‌ఖాన్‌‌ వాదించారు. ఇరువర్గాల మధ్య వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడానికే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని తెలిపారు. ప్రభుత్వ వాదనను తెలియజేయడానికి మరో నాలుగు వారాల గడువు కావాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలంది. సంబంధిత శాఖ అధికారులను సంప్రదించి వారి వివరణను రికార్డుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచినా మళ్లీ గడువు కోరడం సరికాదని పేర్కొంది.