తెలంగాణలోని 40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చండి : బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్

తెలంగాణలోని 40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చండి : బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
  • ప్రధానికి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ లేఖ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు చెందిన 40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ప్రధాని నరేంద్ర మోదీకి  మంగళవారం ప్రధానికి లేఖ రాశారు. ఓబీసీ జాబితాలో ఈ కులాలను చేర్చే అంశం కేంద్రం దగ్గర చాలా కాలంగా పెండింగ్‌‌లో ఉందని లేఖలో పేర్కొన్నారు. ఆలస్యం వల్ల ఆయా కులాలకు చెందిన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీట్లు, ఉద్యోగాల్లో అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు. వచ్చే ఏడాది దేశంలో కులగణన చేపట్టనున్న నేపథ్యంలో ఈ అంశంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని  కోరారు. 

ఈ విషయంపై ఏప్రిల్‌‌లోనే కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖకు లేఖ రాశామని చెప్పారు.  ఓబీసీ జాబితాలో కులాలను చేర్చడం, తొలగించడం, మార్పులు చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 342ఏ ప్రకారం జరుగుతుందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ నుంచి సమాధానం వచ్చినట్లు నిరంజన్ తెలిపారు. ఇక ఈ అంశంపై జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్‌‌సీబీసీ) ఢిల్లీలో ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ కూడా చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.