రూపాయి @96.. ఒకేరోజు 50 పైసలు పతనం.. ఈస్థాయి తగ్గుదల ఇదే మొదటిసారి

రూపాయి @96.. ఒకేరోజు 50 పైసలు పతనం.. ఈస్థాయి తగ్గుదల ఇదే మొదటిసారి

ఈ ఏడాదిలో ఆరు శాతం డౌన్​
చమురు, డాలర్​ బలోపేతం వల్ల కుదేల్​ 

న్యూఢిల్లీ: రూపాయి బక్కచిక్కుతూనే ఉంది.  మొదటిసారిగా శుక్రవారం 96 మార్కును దాటింది. ముడి చమురు ధరలతోపాటు  డాలర్ పెరుగుదల, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా  దీని విలువ ఒకే రోజు 50 పైసలు తగ్గి రూ.96.14 లైఫ్​ టైం లో లెవెల్​కు చేరింది. ఇంటర్‌‌‌‌‌‌‌‌బ్యాంక్ విదేశీ మార్పిడి మార్కెట్లో రూపాయి శుక్రవారం 95.86 వద్ద ప్రారంభమై, రూ.96.14 కి పడిపోయింది. గురువారం ముగింపు రూ.95.64 నుంచి 50 పైసలు తగ్గింది. 

ఈ ఏడాది ఆసియాలోనే అత్యధికంగా పతనమైన కరెన్సీగా నిలిచింది. ఈ సంవత్సరంలో ఇప్పటికే 6 శాతం పడింది. హార్మూజ్ జలసంధి ద్వారా ముడి చమురు రవాణాకు అంతరాయం కలుగుతుందనే భయాల మధ్య ప్రపంచ పెట్టుబడిదారులు డాలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.  -దీంతో రూపాయిపై ఒత్తిడి కొనసాగుతోంది. మన కరెన్సీ బలహీనపడటానికి ప్రధాన కారణాలలో ముడి చమురు ధరలు భారీగా పెరగడం ఒకటి. భారత్ తన ముడి చమురు అవసరాలలో 85 శాతం కంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది. రూపాయి బలహీనపడటంతో దిగుమతుల ఖర్చు పెరుగుతుంది.

107 డాలర్లు దాటిన క్రూడ్​

ముడిచమురు బ్యారెల్ ధర 1.3 శాతం పెరిగి 107 డాలర్ల (రూ.10,287) పైన ట్రేడవుతోంది. పశ్చిమాసియా నుంచి చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందనే ఆందోళనల వల్ల డిమాండ్  ​మరింత పెరిగింది. ఇది భారత్ లాంటి చమురు దిగుమతి దేశాలపై ఒత్తిడిని పెంచుతోంది.  ముడి చమురుతో పాటు బలపడుతున్న డాలర్​ రూపాయిని దెబ్బతీస్తోంది. ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలాన్ని కొలిచే డాలర్ ఇండెక్స్ 0.24 శాతం పెరిగి 99.05 కి చేరుకుంది.   

రూపాయి బలహీనపడటం వల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇంధనం, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక ముడి పదార్థాల వంటి దిగుమతులకు మరిన్ని డాలర్లు ఖర్చు చేయాలి. డాలర్లలో సంపాదించే ఐటీ , ఫార్మా కంపెనీలు కొంత ప్రయోజనం పొందవచ్చు. ముడి చమురు ధరలు, ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాలు, విదేశీ పెట్టుబడిదారుల కార్యకలాపాలు, రూపాయిని రక్షించడానికి ఆర్​బీఐ తీసుకునే చర్యలపై మార్కెట్ సెంటిమెంట్ ఆధారపడి ఉంటుందని స్వస్తిక ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అన్నారు.