భారత కరెన్సీ రూపాయి విలువ డాలర్ తో పోల్చితే రోజురోజుకూ సరికొత్త రికార్డు కనిష్ఠాలకు పడిపోతోంది. ప్రధాని మోడీ దేశ ప్రజలు ఖర్చులు అదుపు చేస్తే ఫారెక్స్ నిల్వలపై ఒత్తిడి తగ్గుతుందని పిలుపు ఇచ్చిన తర్వాత రూపీ పతనం వేగం పుంజుకుంది. ఈ స్పీడ్ చూస్తుంటే త్వరలోనే డాలర్ తో రూపాయి మారకపు విలువ సెంచరీ కొడుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదుడుకులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో భారత కరెన్సీ రూపాయి విలువ గతంలో ఎన్నడూ లేనివిధంగా కుప్పకూలుతోంది. శుక్రవారం నాటి ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే మొదటిసారిగా అత్యంత కీలకమైన 96 రూపాయల మార్కును దాటేసింది. ఒకానొక దశలో రూపాయి విలువ ఏకంగా 96.14 స్థాయికి పడిపోయింది. ఆసియా ఖండంలోనే ఇటీవలి వారాల్లో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచిన కరెన్సీగా రూపాయి నిలిచింది. జనవరి నెల ప్రారంభంలో డాలర్‌తో పోలిస్తే 83-84 రూపాయల మధ్య బలంగా ఉన్న రూపాయి, 5 నెలల కాలంలోనే ఏకంగా 12 రూపాయలకు పైగా(14 శాతం) క్షీణించి 96 రూపాయల కిందికి దిగజారింది.
రూపాయి ఇంతలా పాతాళానికి పడిపోవడానికి ప్రధానంగా అంతర్జాతీయ కారణాలు, చమురు సెగలే కారణమని తెలుస్తోంది. ఇరాన్ ఘర్షణలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 109 డాలర్ల పైనే కొనసాగుతోంది. భారతదేశం తన చమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో, ఎనర్జీ కాస్ట్స్ విపరీతంగా పెరిగిపోయి దేశ దిగుమతుల బిల్లు భారమైంది. దీనికి తోడు అమెరికాలో రిటైల్ అమ్మకాల డేటా బలంగా ఉండటం, లేబర్ మార్కెట్ స్థిరంగా ఉండటంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను అంత త్వరగా తగ్గించకపోవచ్చనే అంచనాలు పెరిగాయి. దీనివల్ల డాలర్ ఇండెక్స్ వరుసగా నాలుగో సెషన్‌లోనూ పుంజుకుని, గ్లోబల్ ఇన్వెస్టర్లకు సురక్షితమైన పెట్టుబడిగా మారింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన సదస్సులో తైవాన్, ఇరాన్ క్రూడ్ లపై ఎలాంటి పురోగతి లేకపోవడం కూడా ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచింది.
ఈ కరెన్సీ సంక్షోభం.. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ ఆర్థిక నిర్వహణ చర్యలను చేపట్టింది. ఇంధన డిమాండ్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 3 రూపాయల చొప్పున పెంచగా, బంగారం దిగుమతులపై కూడా ఆంక్షలు విధించింది. రూపాయి పతనం ఎఫెక్ట్ దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా పడింది. భారత స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ నిధుల ఉపసంహరించుకోవటం, కరెంట్ అకౌంట్ లోటుపై పడుతున్న ఒత్తిడి కారణంగా రూపాయి మారకపు విలువ పెరిగిన డాలర్ల డిమాండ్ కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
