- పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో రూపకల్పన
- 39 రకాల అంశాలతో ప్రతి గ్రామానికి సమగ్ర నివేదిక
- ఒకే వేదికపై పంచాయతీరాజ్, ఆర్‌డీ, మిషన్ భగీరథ, సెర్ప్, స్త్రీనిధి శాఖలు
- గ్రామంలో వీధి కుక్కల నియంత్రణ నుంచి తాగునీరు, రోడ్ల అభివృద్ధి వరకు ప్రతీది ట్రాకింగ్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల రూపురేఖలు మార్చడంతో పాటు నిధుల ఖర్చులో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తోంది. ఏడాది కాలానికి పరిమితమయ్యే తాత్కాలిక ప్లాన్లు కాకుండా మూడేండ్ల కాలపరిమితితో 'సమగ్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక' (జీపీసీడీపీ 2026 -29)ను రెడీ చేస్తోంది.
ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ఊరి ఆవిర్భావం, ప్రొఫైల్ నుంచి మొదలుకొని మూడేండ్లలో ఏం చేయాలి ? ఎంత బడ్జెట్ అవుతుంది ? ఏ శాఖ నుంచి ఎంత ఖర్చు చేస్తున్నారు ? అనే పూర్తి వివరాలను 39 రకాల అంశాలతో డిజిటలైజ్ చేయనున్నారు. దీనివల్ల ఒక్క క్లిక్‌తో గ్రామానికి సంబంధించిన సకల సమాచారం అధికారులు, ప్రజలకు అందుబాటులోకి రానుంది.
పంచాయతీల వద్ద ఉన్న వనరుల ఆధారంగా వివిధ ప్రభుత్వ శాఖలను అనుసంధానిస్తూ పల్లెల్లో సమగ్ర, శాశ్వత అభివృద్ధిని సాధించడంతో పాటు నిధుల దుర్వినియోగానికి చెక్ పెట్టాలని, ప్రతీపైసాకూ లెక్క ఉండేలా ప్రణాళిక రచిస్తోంది. గ్రామసభల ద్వారా ప్రజల ప్రాథమిక అవసరాలను గుర్తించి మూడేండ్లలో ఊరి స్వరూపాన్ని మార్చాలని ప్రణాళిక రూపొందించింది. దీంతో పాటు పంచాయతీరాజ్, ఆర్‌డీ, మిషన్ భగీరథ, సెర్ప్, స్త్రీనిధి శాఖలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నిర్దేశిత గడువులోగా అభివృద్ధి పనులను పూర్తిచేయాలని భావిస్తోంది.
మూడు భాగాలుగా 'జీపీసీడీపీ' నివేదిక
సమగ్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను మూడు భాగాలుగా వర్గీకరించారు. మొదటి విభాగంలో గ్రామ పంచాయతీ ప్రొఫైల్.. అంటే గ్రామానికి సంబంధించిన సమగ్ర డేటాను పొందుపరచనున్నారు. గ్రామం విస్తీర్ణం, సరిహద్దులు, లొకేషన్, జనాభా, పురుషులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంఖ్య, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, బిల్ కలెక్టర్లు, మల్టీ పర్పస్ వర్కర్ల వివరాలను ఇందులో నమోదు చేయనున్నారు.
దీంతో పాటు సాగు భూమి, చెరువులు, కుంటలు, బోరుబావులు, కాలువలు, పంటలు, సీసీ, డాంబర్ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, వైకుంఠ ధామాలు, రైతు వేదికలు, క్రీడా ప్రాంగణాలు, బడులు, అంగన్‌వాడీ సెంటర్లు, హెల్త్ సబ్‌సెంటర్లు, పశువైద్యశాలలు, బ్యాంకులు, రేషన్ షాపులు వంటి వివరాలను పొందుపరచనున్నారు. అలాగే పంచాయతీ పన్నుల వసూళ్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు, గతంలో చేసిన ఖర్చులు, ఆసరా పింఛన్ల లబ్ధిదారులు, సంక్షేమ పథకాల డేటాను సైతం ఈ విభాగంలో అందుబాటులోకి తేనున్నారు.
ఏడు శాఖలను అనుసంధానిస్తూ బడ్జెట్ కేటాయింపు
రాబోయే మూడేండ్లలో ఊరి అభివృద్ధి కోసం ఏడు కీలక శాఖలను అనుసంధానిస్తూ బడ్జెట్ కేటాయించనున్నారు. జీపీ భవనాలు, పారిశుధ్య నిర్వహణ, వీధిదీపాల ఏర్పాటు, భూమి అభివృద్ధి, చెరువుల పూడికతీత, హరితహారం, వైకుంఠధామాల నిర్వహణ, చెత్త సేకరణ (తడి,-పొడి చెత్త), వర్మీ కంపోస్ట్ షెడ్లు, కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామీణ లింక్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, భవనాల రిపేర్లు, ఇంటింటికీ రక్షిత మంచినీటి సరఫరా, పైప్‌లైన్ లీకేజీల అదుపు, కొత్త ట్యాంకుల నిర్మాణం, మహిళా సంఘాల బలోపేతం, రుణాలు, స్వయం ఉపాధి పథకాల ప్రోత్సాహం వంటి అంశాల్లో శాఖలన్నింటి ద్వారా ఊరికి రాబోయే నిధులు, మూడేండ్లలో చేయబోయే ఖర్చులతో ఫైనాన్షియల్ ప్రొజెక్షన్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు.
వార్షిక పనులు.. ఆర్థిక ప్రగతి
గ్రామంలో చేపట్టే పనులు, సాధించిన ఆర్థిక ప్రగతిని ప్రతి ఏడాది పర్యవేక్షించనున్నారు. ప్రజలు నేరుగా గ్రామసభలో లేవనెత్తిన రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పెన్షన్ సమస్యల రికార్డింగ్, వాటి పరిష్కారం, ఇండ్ల అనుమతులు, జనన-మరణ ధ్రువీకరణ పత్రాలు, పన్నుల వసూలు, వీధిదీపాల నిర్వహణ, గ్రామాల్లో ప్రమాదకరంగా మారిన వీధి కుక్కల అదుపునకు నిధుల కేటాయింపు, వ్యాక్సినేషన్, యాంటీ రేబీస్ చర్యలను పర్యవేక్షించనున్నారు. పీఆర్, ఆర్డీ, ఎస్బీఎం–జీ, పీఆర్ ఇంజినీరింగ్, మిషన్ భగీరథ, సెర్ప్, స్త్రీనిధి శాఖలకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాలు, సాధించిన ప్రగతి, ఖర్చు చేసిన నిధుల వంటి ప్రతి విషయాన్ని డిజిటలైజ్చేయనున్నారు. ఇవీ ఏ దశలో ఉన్నాయో కూడా ట్రాక్ చేసేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు. దీన్ని ద్వారా గ్రామానికి సంబంధించిన ప్రతీ సమాచారం అందుబాటులో ఉండటంతో పాటు శాఖల మధ్య సమన్వయం పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గ్రామసభల్లో ప్రజలు అడిగిన అత్యవసర పనులకే ప్రణాళికల్లో మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సెర్ప్, స్త్రీనిధి బడ్జెట్ లెక్కలు స్పష్టంగా ఉండడంతో పొదుపు సంఘాల మహిళలకు ఆర్థిక చేయూత వేగవంతం అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
