కీవ్‌‌ పై రష్యా అటాక్.. ఒకరు మృతి... 41 మిసైల్స్, 125 డ్రోన్లతో విరుచుకుపడ్డ మాస్కో 

కీవ్‌‌ పై రష్యా అటాక్.. ఒకరు మృతి... 41 మిసైల్స్, 125 డ్రోన్లతో విరుచుకుపడ్డ మాస్కో 

కీవ్‌‌: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌‌పై రష్యా మరోసారి బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడికి తెగబడింది. ఈ అటాక్‌‌లో ఒకరు మరణించారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం వేకువజామున ప్రారంభమైన ఈ దాడి నిరంతరాయంగా కొనసాగింది. పేలుళ్లతో కీవ్ సిటీ దద్దరిల్లిపోయింది. రష్యా ఏకకాలంలో 41 క్షిపణులు, 125 డ్రోన్లతో దాడి చేసిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. 

ఇందులో అత్యధిక భాగం కీవ్‌‌ను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించినవేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలిదిమిర్ జెలెన్‌‌ స్కీ పేర్కొన్నారు. దాడులతో కీవ్‌‌లోని ఐదు జిల్లాల్లో భారీగా మంటలు  చెలరేగాయి. 

నివాస భవనాలు, కార్యాలయాలు, ఇండస్ట్రియల్ సైట్స్, ఒక హాస్టల్‌‌తో పాటు పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే రంగంలోకి దిగింది. స్వియాటోషిన్స్కీ జిల్లాలో మంటల్లో కాలిపోతున్న ఒక ఇంటి నుంచి నలుగురిని సురక్షితంగా బయటకు తీశారు. 

షెవ్‌‌చెంకివ్‌‌స్కీ జిల్లాలో మంటల్లో చిక్కుకున్న మూడు అంతస్తుల బిల్డింగ్ నుంచి నివాసితులను కాపాడారు. అయితే, దురదృష్టవశాత్తు ఈ బిల్డింగ్‌‌లో ఒకరు మరణించినట్టు రెస్క్యూ టీమ్ తెలిపింది. కాగా, ఉక్రెయిన్ సైనిక స్థావరాలనే తాము లక్ష్యంగా చేసుకున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.