
- డెలివరీలు మొదలయ్యాయన్న రష్యా అధికారి
న్యూఢిల్లీ: మన దేశానికి ఎస్400 సర్ఫేస్ టు ఎయిర్ మిసైళ్ల డెలివరీ మొదలైందని రష్యా ఫెడర్ సర్వీస్ ఫర్ మిలటరీ టెక్నికల్ కో–ఆపరేషన్ డైరెక్టర్ దిమిత్రీ షూగవ్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం వాటిని ఇండియాకు అందజేస్తున్నామన్నారు. దుబాయ్‌లో నిర్వహిస్తున్న ఎయిర్‌షోలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే మొదటి బ్యాచ్ ఎస్400 మిసైల్ సిస్టమ్స్ బయల్దేరాయని రక్షణ శాఖ వర్గాలు చెప్తున్నాయి. పాకిస్థాన్, చైనాల నుంచి ముప్పు ఉన్న ప్రాంతాల్లో వాటిని మోహరిస్తారని అంటున్నాయి. ఓడలు, విమానాల్లో వాటిని తీసుకొస్తున్నారని చెప్పాయి. ఈ ఏడాది చివరి నాటికి మొదటి బ్యాచ్‌లోని మొత్తం మిసైళ్లు ఇండియాకు అందనున్నట్లు తెలిపాయి. వాటి వాడకంపై ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి మన దేశంలోనే ట్రైనింగ్ ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు.
మస్తు పవర్ఫుల్
ఎస్400 మిసైళ్లను ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ మిసైళ్లలో ఒకటని చెప్తుంటారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌లో బెస్ట్ అని అంటుంటారు. శత్రు దేశాల మిసైళ్లను నాశనం చేసేందుకు భూమి మీద నుంచే వీటిని ప్రయోగిస్తారు. ఎక్కడికంటే అక్కడికి సులువుగా తీసుకెళ్లొచ్చు. గరిష్టంగా 400 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను నాశనం చేయగలవు. 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న వాటిని పేల్చేయగలవు. గంటకు 4,284 కిలోమీటర్ల వేగం(సౌండ్ స్పీడ్‌కు మూడున్నర రెట్ల వేగం)తో దూసుకెళ్లగలవు. టార్గెట్‌ను గుర్తించాక దాని వేగం 17,280 కిలోమీటర్లకు చేరుతుందట. యాక్టివ్ రాడార్ హోమింగ్ హెడ్ అనే సిస్టమ్ ఉండడం వల్ల అది.. ఫిక్స్ చేసిన ఎత్తుకు వెళ్లి అక్కడ టార్గెట్‌ను గుర్తించి నాశనం చేస్తుంది.