ప్రాణహిత సర్వే పూర్తి.. అలైన్‌‌మెంట్‌‌ రిపోర్ట్‌‌ అందజేసిన ఆర్‌‌వీ కన్సల్టెన్సీ

ప్రాణహిత సర్వే పూర్తి.. అలైన్‌‌మెంట్‌‌ రిపోర్ట్‌‌ అందజేసిన ఆర్‌‌వీ కన్సల్టెన్సీ

 

  •     తుమ్మడిహెట్టి నుంచి సుందిళ్ల బ్యారేజీకి నీటి తరలింపు
  •     వినియోగంలోకి 76.565 కిలోమీటర్ల పాత కాల్వలు 
  •     19.300 కిలోమీటర్లు టన్నెల్‌‌, 13.855 కిలోమీటర్ల కెనాల్‌‌
  •     149 నుంచి 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం !


మంచిర్యాల, వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్ట్‌‌పై స్పీడ్‌‌ పెంచింది. ప్రాణహిత నీళ్లను తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల బ్యారేజీకి తరలించాలని నిర్ణయించి డీపీఆర్‌‌ తయారీకి గతేడాది నవంబర్‌‌లో రూ.11.88 కోట్లతో టెండర్లు​ పిలిచింది. ఈ టెండర్‌‌ దక్కించుకున్న ఆర్‌‌వీ కన్సల్టెన్సీ అలైన్‌‌మెంట్‌‌ రిపోర్ట్​ను తయారుచేసి ఇటీవలే ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుస్తోంది. ఈ రిపోర్ట్‌‌కు సర్కారు నుంచి ఆమోదం రాగానే జియోగ్రాఫికల్, హైడ్రాలజీ, ఫ్లడ్‌‌ కాలిక్యులేషన్‌‌ తదితర అంశాలను స్టడీ చేసి డీపీఆర్‌‌ రూపొందించనున్నట్టు అధికారులు తెలిపారు. 2008లో అప్పటి కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్ట్‌‌ పనులను ప్రారంభించింది. సుమారు రూ.10 వేల కోట్లతో 76.565 కిలోమీటర్ల పొడవైన కాల్వలు తవ్వారు. ఆ తర్వాత వచ్చిన బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ నిర్మాణం చేపట్టడంతో ప్రాణహిత పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అయితే ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్‌‌ను నిర్మించి ప్రాణహిత నీటిని వాడుకోవాలని నిర్ణయించిన రేవంత్‌‌రెడ్డి సర్కార్‌‌  ఆ దిశగా కసరత్తు 
ముమ్మరం చేసింది. 

సుందిళ్ల వరకు నీరు...

గతంలో తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌ వరకు 116 కిలోమీటర్లను ఐదు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. ఇందులో మూడో ప్యాకేజీ పూర్తిగా బ్యారేజీ నిర్మాణం కాగా, ఐదో ప్యాకేజీ మినహా మిగతా మూడు ప్యాకేజీల్లోని కెనాల్స్‌‌ తవ్వారు. ప్రస్తుత సర్కారు ఐదో ప్యాకేజీలో పూర్తిగా మార్పులు చేసి ప్రాణహిత నీళ్లను ఎల్లంపల్లికి బదులుగా సుందిళ్ల బ్యారేజీకి తరలించేలా ప్లాన్‌‌ చేసింది. పాత డీపీఆర్​ప్రకారం 76.565 కిలోమీటర్‌‌ మైలారం దగ్గర లిఫ్ట్​ఏర్పాటు చేయాల్సి ఉండడంతో దానిని పక్కనపెట్టి గ్రావిటీ ద్వారా సుందిళ్ల బ్యారేజీకి నీటిని తరలించాలని నిర్ణయించింది. దీంతో లిఫ్ట్‌‌ నిర్మాణానికి అయ్యే ఖర్చు తప్పడమే కాకుండా.. కెనాల్‌‌ పొడవు కూడా ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు తగ్గుతుంది.

పాత కెనాల్స్‌‌ను వినియోగించుకుంటూ...

గతంలో తవ్విన 76.565 కిలోమీటర్ల పాత కెనాల్స్‌‌ను వినియోగించుకుంటూ... అక్కడినుంచి 109.720 కిలోమీటరైన సుందిళ్ల బ్యారేజీ వరకు కొత్త అలైన్‌‌మెంట్‌‌ను ఆర్‌‌వీ కన్సల్టెన్సీ రెడీ చేసింది. ఇందులో 76.565 కిలోమీటర్‌‌ మైలారం నుంచి 95.865 కిలోమీటర్‌‌ మిట్టపల్లి వరకు 19.300 కిలోమీటర్లు టన్నెల్‌‌ నిర్మించి ఆ తర్వాత టేకుమట్ల వాగుకు లింక్‌‌ చేయాలనుకున్నారు. కానీ వాగులో కలపడం వల్ల భవిష్యత్‌‌లో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో దానికి ఆల్టర్నేట్‌‌గా సుందిళ్ల బ్యారేజీ వరకు కెనాల్‌‌ నిర్మించడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు 95.865 కిలోమీటర్‌‌ నుంచి 109.720 కిలోమీటర్ల వరకు 13.855 కిలోమీటర్ల దూరం కెనాల్‌‌ తవ్వకానికి అలైన్‌‌మెంట్‌‌ రూపొందించారు.

150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ !

ప్రాణహిత ప్రాజెక్ట్‌‌లో కీలకమైన బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాల్సి ఉంది. గతంలో 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని ప్రతిపాదించినప్పటికీ అందుకు మహారాష్ట్ర సర్కార్‌‌ ఒప్పుకోలేదు. ఆ రాష్ట్రంలో ముంపు ప్రభావం తగ్గేలా 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించుకోవాలని సూచించింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రాణహిత బ్యారేజీని 149 నుంచి 150 మీటర్ల ఎత్తు వరకే నిర్మించాలని ప్రస్తుత ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మొత్తం 6.5 కిలోమీటర్ల పొడవున కాంక్రీట్‌‌ స్ట్రక్చర్‌‌తో పాటు బండ్‌‌ నిర్మించి 80 టీఎంసీల నీటిని సుందిళ్ల బ్యారేజీకి తరలించే విధంగా డీపీఆర్‌‌ రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. జియోగ్రాఫికల్, హైడ్రాలజీ, ఫ్లడ్‌‌ కాలిక్యులేషన్‌‌ స్టడీ చేసి డీపీఆర్‌‌ తయారైన తర్వాతే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు ఉంటాయని తెలుస్తోంది.