ఒక్క గాలి వానకే ఎగిరిపోతున్నయ్

ఒక్క గాలి వానకే ఎగిరిపోతున్నయ్
  • ఒక్క గాలి వానకే ఎగిరిపోతున్నయ్
  • చాలాచోట్ల నాసిరకంగా రైతువేదికలు, శ్మశానవాటికలు
  • సెగ్రిగేషన్ షెడ్లు, విలేజ్ పార్కులదీ అదే పరిస్థితి
  • హడావిడి పనులు.. క్వాలిటీపై ఆరోపణలు
  • ఆరు నెలలు తిరక్కముందే బయటపడుతున్న నాణ్యతా లోపాలు
  • చేసిన పైసలు రాకముందే చెల్లాచెదురు

వెలుగు, నెట్​వర్క్​/మహబూబాబాద్​: సర్పంచులు, కాంట్రాక్టర్ల మెడ మీద కత్తి పెట్టి రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్లతో హడావిడిగా నిర్మించిన రైతువేదికలు, శ్మశానవాటికలు, సెగ్రిగేషన్ షెడ్లు, విలేజ్ పార్కుల్లో నాణ్యతలోపాలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. నాసిరకం పనుల కారణంగా గోడలు ఎక్కడికక్కడ పగుళ్లు పెడుతుండగా, ఇటీవల కురిసిన ఒక్క గాలివానకే చాలాచోట్ల వీటి పైకప్పులు ఎగిరిపోయాయి. కొవిడ్​ టైంలోనూ ప్రభుత్వం కొంపలు మునిగిపోయినట్లు టార్గెట్ల మీద టార్గెట్లు పెట్టి మరీ వీటిని పూర్తిచేయించింది. పనులు కంప్లీట్​ అయ్యి ఆరు నుంచి ఎనిమిది నెలలు కూడా కాలేదు.. చేసిన పనులకు చాలా చోట్ల బిల్లులు కూడా రాలేదు.. కానీ అంతలోనే ఇలాంటి పరిస్థితి రావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఉరికురికి పనులు.. 
పల్లె ప్రగతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఊరూరా శ్మశానవాటిక, డంపుయార్డు, విలేజ్​పార్కు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఒక్కో శ్మశానవాటికకు రూ.12 లక్షలు, డంపింగ్ యార్డు కు రూ.2.50లక్షలు, విలేజ్​పార్కుకు రూ. 5.7లక్షల చొప్పున మంజూరు చేసింది. ఈ పనులను దాదాపు ఆయా గ్రామాల్లోని సర్పంచులకే అప్పగించింది. ఇవిగాక స్టేట్​వైడ్​ ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్​ చొప్పున 2,604 క్లస్టర్ల పరిధిలో  రైతువేదికలను నిర్మించాలని భావించింది. ఇందుకోసం ప్రతి క్లస్టర్​కు రూ.22 లక్షల చొప్పున ఏకంగా రూ.573 కోట్లు సాంక్షన్​ చేసింది. ఈ  రైతువేదికల పనులను మాత్రం చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తమ అనుచరులు, తెలిసిన కాంట్రాక్టర్లకే అప్పగించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా ఈజీఎస్​ఫండ్స్​తో చేపట్టిన ఈ పనులను  పంచాయతీరాజ్​, డీఆర్డీఏ ఆఫీసర్లు పర్యవేక్షించారు. ఆయా నిర్మాణాలను మొదట గతేడాది పంద్రాగస్టు​, తర్వాత దసరా, దీపావళి లోగా కంప్లీట్​ చేయాలని సర్పంచులు, సెక్రెటరీలపై  ఉన్నతాధికారులు టార్గెట్ల మీద టార్గెట్లు పెడుతూ వచ్చారు. 

క్వాలిటీపై అనుమానాలు.. 
క్షేత్రస్థాయిలో వివిధ సమస్యలు ఎదురైనప్పటికీ   అవేవీ పట్టించుకోని ఆఫీసర్లు సర్పంచులు, కార్యదర్శులకు నోటీసులు ఇవ్వడం, సస్పెండ్​ చేయడం ద్వారా ఒత్తిడి పెంచారు. దీంతో చాలాచోట్ల పనులు అత్యంత నాసిరకంగా సాగాయి. పలుచోట్ల సిమెంట్​ తక్కువగా వాడారని, క్యూరింగ్​ చేయకుండానే చకచకా గోడలు పూర్తిచేశారని, పైకప్పుకు క్వాలిటీ లేని పైపులు, రేకులు వాడారని.. ఇలా అనేక ఆరోపణలు వచ్చాయి. చాలా చోట్ల గోడలకు ప్లాస్టింగ్​ చేసిన రెండు, మూడురోజులకే కలరింగ్​ చేశారు.  ముఖ్యంగా రైతువేదికల గోడలు ఎత్తుగా ఉండడం, సరైన క్యూరింగ్​ చేయకపోవడంతో పగుళ్లుబారుతున్నాయి. పైకప్పుకు వేసిన రేకుల గేజ్​ తక్కువగా ఉండి గాలికి ఊగుతున్నాయి.  పైపులు, వాటి వెల్డింగ్​,రేకుల ఫిట్టింగ్​లలోనూ నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. ఫలితంగా కొద్దిపాటి గాలులకే పై కప్పులు ఎగిరిపోతున్నాయి. ఇక  రైతువేదికల వద్ద టాయిలెట్స్, శ్మశాన వాటికల వద్ద బాత్రూమ్స్​ అధ్వాన్నంగా తయారయ్యాయి. చాలాచోట్ల ట్యాపులు పనిచేయడం లేదు. తలుపులు పగిలిపోయాయి. టార్గెట్ల మీద ఫోకస్​ పెట్టిన ఉన్నతాధికారులు క్వాలిటీని పట్టించుకోకపోవడమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

విలేజ్​ పార్కు పశువులపాలు..
ఇది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం లోని ఒడ్డుగూడ పల్లె ప్రకృతి వనం. సుమారు రూ.5లక్షలకు పైగా ఖర్చుతో ఏర్పాటుచేసి, వందల మొక్కలు నాటారు. హడావిడిగా ప్రారంభించి, నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఇలా పశువులు మేస్తున్నాయి.

సజ్జ కుంగింది.. నాణ్యత నవ్వింది..
కరీంనగర్ జిల్లా  రామడుగులో నిర్మించిన రైతువేదిక భవనం ప్రారంభానికి ముందే పగుళ్లు పెడుతోంది. నాణ్యమైన ఇసుక, సిమెంట్ వాడకపోవడం, క్యూరింగ్ చేయకపోవడం వల్ల పగుళ్లు వచ్చాయని ఇటీవల కొందరు జిల్లా కలెక్టర్ కు  కంప్లైంట్ చేశారు. రైతువేదిక వెనుకవైపు ఉన్న సజ్జ కుంగడంతో సపోర్టుగా కట్టె అమర్చారు. ఇక పైకప్పుపై వేసిన రేకులు గాలికి ఊగుతున్నాయి.

ప్రారంభానికి  ముందే టాప్​ లేచిపాయె..
ఇది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండల గురుడు పేట్ లో నిర్మించిన శ్మశానవాటిక. రూ.10 లక్షలతో నిర్మించిన దీనిని ఇంకా ప్రారంభించలేదు. కానీ ఇటీవల వచ్చిన గాలివానకు రేకులన్నీ లేచిపోయి ఇలా తయారైంది. క్వాలిటీ లేకుండా కట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పలువురు ఆరోపిస్తున్నారు.

శ్మశానంలోనూ పైకప్పు
ఇది నిజామాబాద్​ జిల్లా ఎడపల్లి మండలం ‌వడ్డేపల్లి లోని వైకుంఠధామం. సుమారు రూ.10లక్షలకుపైగా ఖర్చుతో కట్టిన ఈ శ్మశానవాటికలో నాణ్యత లోపాలు బయటపడుతున్నాయి. ఇటీవలి గాలివానకు స్నానాల గదుల పైకప్పు ఇలా ఎగిరిపోయింది.

అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలి
రైతు వేదికల నిర్మాణంలో క్వాలిటీ పాటించలేదు. కట్టి నెలలు గడవకముందే  గోడలు నెర్రెలు బారుతున్నవి. గాలులకు పై కప్పులు లేచిపోతున్నవి. అందులో సమావేశాలకు పోవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్లు, ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలె.
– రాసమల్ల వెంకన్న,  రైతు, జయపురం, మహబూబాబాద్​ జిల్లా