- ఈనెల 16 నుంచి 22 వరకు ఎగ్జామ్స్
- కొత్త షెడ్యూల్ విడుదల చేసిన ఎస్సీఈఆర్టీ
హైదరాబాద్,వెలుగు: సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ–2) పరీక్షల టైమ్ టేబుల్ మారింది. ఈ నెల 16 నుంచి 22 వరకూ పరీక్షలు నిర్వహిస్తామని ఎస్సీఈఆర్టీ గురువారం రాత్రి రీషెడ్యూల్‌ను విడుదల చేసింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 23ను చివరి వర్కింగ్ డేగా ప్రకటించారు. దీంతో ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి. ఎస్సీఈఆర్టీ అధికారులు బుధవారం ఇచ్చిన షెడ్యూల్ పై ‘ఎస్ఏ–2 పరీక్షలు ఏప్రిల్7 నుంచే’ శీర్షికతో వారంలోపే పరీక్షల నిర్వహణ సాధ్యం కాదంటూ వెలుగులో వచ్చిన కథనంపై సర్కారు స్పందించింది. డీసీఈబీ అధికారులు కూడా ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకూ వారంలోపే క్వశ్చన్ పేపర్లను ప్రింట్ చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పినట్టు తెలిసింది. సర్కారు ఆదేశాల మేరకు పది రోజుల పాటు ఎగ్జామ్స్‌ను వాయిదా వేశారు. 1 నుంచి 5 తరగతులకు ఈ నెల 16 నుంచి 20 వరకు, 6 నుంచి 9వ తరగతి వరకూ 16 నుంచి 22 వరకు కొనసాగుతాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి ప్రకటించారు. ఎండల కారణంగా ఎగ్జామ్ టైమ్ మార్చారు. 1 నుంచి 5 క్లాసులకు ఉదయం 8 నుంచి 10.30 వరకు, 6, 7 క్లాసులకు 8 నుంచి 10.45 వరకు, 8వ తరగతి స్టూడెంట్లకు 11.30 నుంచి మధ్యాహ్నం 2.15 వరకు, నైన్త్ స్టూడెంట్లకు ఉదయం 8 నుంచి 10.45 వరకు పేపర్ 1, ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.15 వరకు పేపర్ 2 పరీక్షలు ఉంటాయని తెలిపారు.
