
- శభాష్ సబలెంకా.. యూఎస్ ఓపెన్‌లో రెండోసారి టైటిల్ సొంతం
- ఫైనల్లో అనిసిమోవాపై గెలుపు.. కెరీర్‌లో నాలుగో గ్రాండ్‌స్లామ్ కైవసం
బెలారస్ స్టార్ అరీనా సబలెంకా విమెన్స్ టెన్నిస్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో ఓడిపోయినా పోరాటం వదలకుండా ఈ ఏడాది మూడో గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్ చేరిన వరల్డ్ నంబర్ వన్ యూఎస్ ఓపెన్‌లో టాప్ క్లాస్ ఆటతో తన టైటిల్‌ను నిలబెట్టుకుంది.
గత రెండు గ్రాండ్‌స్లామ్స్‌లో తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్న టాప్ సీడ్ ప్లేయర్ కెరీర్‌లో నాలుగో మేజర్ ట్రోఫీ గెలుస్తూ ఈ సీజన్‌ను ఘనంగా ముగించింది. ఇంకోవైపు వింబుల్డన్ ఫైనల్లో ఇగా స్వైటెక్ చేతిలో చిత్తయిన అమెరికా సంచలనం అమండా అనిసిమోవా సొంతగడ్డపై తుదిపోరులో ప్రాణం పెట్టి ఆడినా సబలెంకా అడ్డు దాటలేక తొలి గ్రాండ్‌స్లామ్ అందుకోలేకపోయింది.
న్యూయార్క్: డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్ వన్ అరీనా సబలెంకా మళ్లీ అదరగొట్టింది. అమెరికా సంచలనం అమండా అనిసిమోవా విసిరిన సవాల్‌ను ఛేదిస్తూ యూఎస్ ఓపెన్‌లో తన టైటిల్ నిలబెట్టుకుంది శనివారం అర్ధరాత్రి జరిగిన విమెన్స్ సింగిల్స్ ఫైనల్ ఫైట్‌లో టాప్ సీడ్ అరీనా 6–-3, 7–-6(7/3)తో వరుస సెట్లలో ఎనిమిదో సీడ్ అనిసిమోవాను ఓడించింది. ఫలితంగా అమెరికా లెజెండ్ సెరెనా విలియమ్స్ (2014) తర్వాత యూఎస్ ఓపెన్‌లో వరుసగా రెండుసార్లు టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. 94 నిమిషాల పోరులో సబలెంకా ఒకే ఏస్ కొట్టినా 3 నెట్ పాయింట్లు, 5 బ్రేక్ పాయింట్లు గెలిచి 13 విన్నర్లు కొట్టింది.
రెండు డబుల్ ఫాల్ట్స్, 15 అనవసర తప్పిదాలు చేసింది. మొత్తంగా 76 పాయింట్లు నెగ్గింది. అనిసిమోవా నాలుగు ఏస్‌లు, 22 విన్నర్లు కొట్టినా.. నెట్ పాయింట్ (2), బ్రేక్ పాయింట్స్ (4)లో వెనుకబడింది. ఏడు డబుల్ ఫాల్ట్స్, 29 అనవసర తప్పిదాలు చేసిన ఆమె మొత్తంగా 59 పాయింట్లకే పరిమితం అయింది. ఈ విజయంతో అరీనా తన టాప్ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకోగా.. అనిసిమోవా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్–5లోకి రానుంది.
హోరాహోరీలో అరీనాదే పైచేయి
హార్డ్ హిట్టర్లుగా పేరొందిన సబలెంకా, అనిసిమోవా ఆఖరాటలో తమదైన స్టయిల్లో చెలరేగారు. బాల్‌ను బలంగా కొడుతూ పాయింట్ల కోసం తీవ్రంగా శ్రమించారు. తొలి సెట్ లో ఇద్దరూ సర్వీస్‌ను లక్ష్యంగా చేసున్నారు. అనిసిమోవా తొలి సర్వీస్‌నే బ్రేక్ చేసిన టాప్ సీడ్ ప్లేయర్ అరీనా 2–0తో ఆధిక్యం అందుకుంది.
మూడో గేమ్‌లో తను 30–0తో నిలవడంతో వింబుల్డన్ మాదిరిగా.. అమెరికన్ అనిసిమోవా పూర్తిగా తేలిపోతుందని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కానీ, అనూహ్యంగా పుంజుకున్న లోకల్ ప్లేయర్ తర్వాత నాలుగు పాయింట్లు సాధించింది. బ్యాక్‌హ్యాండ్, ఫోర్‌హ్యాండ్ విన్నర్లతో ఆ గేమ్ గెలిచి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. అదే జోరుతో3–-2తో ఆధిక్యంలోకి వచ్చింది. అయినా కంగారు పడని సబలెంకా తర్వాతి నాలుగు గేమ్‌లు నెగ్గింది. తన అనుభవాన్ని రంగరించి ఆడుతూ కీలకమైన తొమ్మిదో గేమ్‌లో అనిసిమోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి 38 నిమిషాల్లోనే సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే, రెండో సెట్‌లో అసలు పోరు మొదలైంది.
ఇద్దరూ పోటాపోటీగా ఆడుతూ చెరో గేమ్ నెగ్గుతూ వెళ్లారు. అయితే, సబలెంకా 5–-4 ఆధిక్యంలో ఉండి చాంపియన్‌షిప్ కోసం సర్వీస్ చేసింది. స్కోరు 30-–30 వద్ద ఉన్నప్పుడు ఆమెకు అతి సులువైన ఓవర్‌హెడ్ స్మాష్ లభించింది. కానీ, అనూహ్యంగా దానిని నెట్‌లోకి కొట్టింది. ఆ క్షణంలో ఆమె తన రాకెట్‌ను నేలకేసి కొట్టి, నిరాశతో నవ్వింది. ఈ అవకాశాన్ని 24 వేల మంది లోకల్ ఫ్యాన్స్ మద్దతుతో అందిపుచ్చుకున్న అనిసిమోవా వెంటనే సబలెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసి మ్యాచ్‌లో నిలిచింది.
సెట్‌ను టై బ్రేక్‌కు తీసుకెళ్లింది. కానీ, టైబ్రేక్‌లో సబలెంకా ప్రశాంతంగా, గత ఫైనల్స్‌లో చేసిన తప్పులను పునరావృతం చేయకూడదన్న పట్టుదలతో ఆడింది. పవర్‌ఫుల్ సర్వీస్‌లు, పర్ఫెక్ట్ గ్రౌండ్ స్ట్రోక్స్‌తో అనిసిమోవాపై ఆధిపత్యం చెలాయించిన అరీనా 7-–3 తేడాతో టైబ్రేక్‌ను, మ్యాచ్‌ను ముగించింది. విజయం తర్వాత ఆమె మోకాళ్లపై కూర్చొని, ముఖాన్ని చేతులతో కప్పుకుని ఆనందభాష్పాలు రాల్చింది.
గ్రానోలర్స్-జెబలోస్ జోడీకి మెన్స్ డబుల్స్ టైటిల్
మార్సెల్ గ్రానోలర్స్, హోరాసియో జెబాలోస్ జోడీ యూఎస్ ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ గెలిచింది. ఈ సీజన్‌లో తమ రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఐదోసీడ్ గ్రానోలర్స్ (స్పెయిన్)–జెబాలోస్ (అర్జెంటీనా) ద్వయం 3–-6, 7–-6 (7/4), 7–-5తో ఆరో సీడ్ , బ్రిటన్ జోడీ జో సాలిస్‌బరీ– నీల్ స్కప్‌స్కీపై ఉత్కంఠ విజయం సాధించింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ఇదే జోడీని ఓడించి తొలి టైటిల్ నెగ్గింది.
4 సబలెంకా కెరీర్‌లో ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్. అన్నీ హార్డ్ కోర్టులపై గెలవడం విశేషం.
100 గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రా మ్యాచ్‌ల్లో సబలెంకాకు ఇది 100వ విజయం.