
వరలక్ష్మీ శరత్ కుమార్ ఫిమేల్ లీడ్‌గా నటించిన చిత్రం ‘శబరి’. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పిన విశేషాలు.
మూడేళ్ల క్రితమే ఈ కథ విని చేస్తానని చెప్పా. కానీ షూటింగ్ కొంచెం లేట్‌గా స్టార్ట్ చేశాం. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. తల్లి పాత్ర పోషించా. భర్తతో సమస్యల కారణంగా, అతని నుంచి వేరుగా ఉంటూ కుమార్తెను ఒంటరిగా పెంచే క్యారెక్టర్ నాది. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం లభించింది. లౌడ్ మూమెంట్స్ ఉండవు. ఓ సమస్య నుంచి కూతురిని కాపాడుకోవడానికి తల్లి పడే తపన అందరికీ నచ్చుతుంది.
మదర్ అండ్ డాటర్ కనెక్షన్ హైలైట్ అవుతుంది. స్క్రీన్‌ప్లే డ్రివెన్ సినిమా ఇది. ప్రేక్షకులకు కొత్త థ్రిల్‌ను ఇస్తుంది. నేచురల్ ఫైట్ సీక్వెన్సులు ఉంటాయి. కొత్త దర్శక నిర్మాతలతో సినిమా చేయడం కొందరు రిస్క్ అంటున్నారు. కానీ నేను లైఫే రిస్క్ అంటాను. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అలాగే హిట్టూ ఫ్లాపులను ఎవరూ జడ్జ్ చేయలేరు. ఈ సినిమా విషయంలోనూ అంతే. మేం ఒక డిఫరెంట్ సినిమా చేశాం. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ చిత్ర నిర్మాత మహేంద్రనాథ్ జెన్యూన్ పర్సన్. ఆయనతో మరో సినిమా చేయడానికి కూడా నేను రెడీ.
నేను ఎలాంటి జానర్ చేసినా.. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడు నా పెర్ఫార్మెన్స్ బాలేదని అనుకోకూడదు. అంతే నేను చూసుకుంటా. ఇక నేను నటించిన ‘కూర్మ నాయకి’ విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ధనుష్ ‘రాయన్’ సినిమాతో పాటు మరో సినిమా చేస్తున్నా. అలాగే కన్నడలో సుదీప్ ‘మ్యాక్స్’ చేశా. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇక ఈ మధ్యే నాకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. పెళ్లి కూడా ఈ ఏడాదిలోనే ఉంటుంది’’.