శబరిమల అయ్యప్ప దర్శనంపై అమల్లోకి రెండు కొత్త రూల్స్

శబరిమల అయ్యప్ప దర్శనంపై అమల్లోకి రెండు కొత్త రూల్స్

పాతనంతిట్ట: శబరిమల అయ్యప్ప దర్శనానికి అయ్యప్ప మాలలో ఉన్న స్వాములతో పాటు సామాన్య భక్తులు పోటెత్తారు. ఊహించని విధంగా అంచనాలకు మించి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేయలేదని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో.. దర్శనం స్పాట్ బుకింగ్పై ఆలయ అధికారులు ఆంక్షలు విధించారు. స్పాట్ బుకింగ్ దర్శన టికెట్లను రోజుకు 20 వేలకు కుదిస్తున్నట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు. స్పాట్ బుకింగ్ టికెట్ల కోసం భారీగా తరలివస్తున్న భక్తులతో పంబ కిక్కిరిసిపోతుండటంతో.. కొత్తగా నీలక్కల్లో కూడా ఏడు స్పాట్ బుకింగ్ కౌంటర్లను ఓపెన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

అంతేకాదు.. శబరిమలకు రోజుకు లక్ష మంది భక్తులకే అయ్యప్ప దర్శనానికి అనుమతి ఉంటుందని.. మిగిలిన భక్తులను మరుసటి రోజు దర్శనానికి అనుమతించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. రాత్రి సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా నీలక్కల్లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

శబరిమలలో అయ్యప్ప ఆలయం తెరిచిన రెండు రోజుల వ్యవధిలోనే దాదాపు రెండు లక్షల మంది భక్తులు శబరిమలకు వెళ్లడంతో ఆలయ అధికారులే విస్తుపోయారు. భారీగా భక్తులు వస్తారని తెలుసు గానీ రెండు రోజుల్లోనే మరీ ఈ స్థాయిలో వస్తారని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ కూడా ఊహించకపోవడం వల్లే ఏర్పాట్లపై భక్తుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.