మా ఆస్తుల వివరాలు రేవంత్ చెప్పేదేంది? : సబితా ఇంద్రారెడ్డి

మా ఆస్తుల వివరాలు రేవంత్ చెప్పేదేంది? : సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేతల ఆస్తుల వివరాలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పేదేందని.. అడిగితే తామే లిస్ట్ ఇచ్చేవాళ్లమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి భూముల చుట్టూ తిరుగుతున్నారని, బహుదూర్ గూడ భూముల గురించి ఆయనకు అవగాహన లేదని తెలిపారు. బుల్లెట్ ట్రైన్ కు తాము వ్యతిరేకం కాదని.. రైతుల భూములు గుంజుకోకుండా బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలని డిమాండ్​ చేశారు. దీనిపై రైతుల పక్షాన పోరాడుతామన్నారు. గురువారం ఆమె తెలంగాణభవన్​లో మీడియాతో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లాలో రేవంత్​రెడ్డి ఎక్కడెక్కడ భూములు పోగు చేసుకున్నాడో తమకు తెలుసన్నారు. తిమ్మాపూర్ భూదాన్​భూములపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. 

తాను ఎమ్మెల్యేగా పోటీ చేసిన 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తన అఫిడవిట్ చూస్తే ఆస్తులు పెరిగాయో తగ్గాయో తెలుస్తుందన్నారు. తన భర్త ఇంద్రా రెడ్డి చనిపోతే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ లో చేరానని, మరి, రేవంత్​ రెడ్డి ఎప్పుడు చేరారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి నేను ఏం సేవ చేశానో రంగారెడ్డి జిల్లా ప్రజలకు తెలుసన్నారు. తన కుమారుడు కార్తీక్​కు రేవంత్​ రెడ్డి టికెట్​ ఇప్పించారా అని నిలదీశారు. తాను త్యాగం చేస్తే కార్తీక్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారని వివరించారు. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి పోయేటట్టు చేసిందే రేవంత్​రెడ్డి అని సబిత పేర్కొన్నారు.